JP  YSRCP :  లోక్‌సత్తా  జయప్రకాష్ నారాయణ వైఎస్ఆర్‌సీపీలో చేరుతారంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం విజయవాడలో జరిగిన ఆప్కాబ్ కార్యక్రమంలో జగన్, జేపీ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడమే. జేపీకి రాజకీయ ఆసక్తి ఉంది. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి మల్కాజిగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు పార్లమెంట్‌కు వెళ్లాలన్న ఆసక్తి ఉంది. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌తో ఆయన ముచ్చట్లు.. కొత్త ఊహాగానాలు దారి తీస్తున్నాయి. 


లోక్‌సత్తా పార్టీని రద్దు చేసుకున్న  జేపీ 


లోక్‌సత్తాను ప్రజలను చైతన్యవంతం చేసే సంస్థగా ప్రారంభించి తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు జయప్రకాష్ నారాయణ.  2009 ఎన్నికల్లో  ఆయన పార్టీ రెండు శాతం ఓట్లు సాధించింది.  కూకట్‌పల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా  ఆయన ఒక్కరు మాత్రం గెలిచారు.  ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి పోటీచేసి నాలుగో స్థానంలో నిలిచారు.  అప్పట్నుంచీ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్న జేపీ ఇటీవల వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. పార్లమెంట్‌కు వెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. లోక్ సత్తా పార్టీని మళ్లీ పునరుద్ధరించి ఆ పార్టీ తరపునపోటీ చేస్తారా లేకపోతే వేరే ఇతర పార్టీలో చేరుతారా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. నిజానికి లోక్ సత్తను రద్దు చేసినట్లుగా జేపీ ప్రకటిచారు కానీ.. ఆ పార్టీ మాజీ నేతలు విడిగా లోక్ సత్తా పేరుతో పార్టీని కొనసాగిస్తున్నారు. కానీ పెద్దగా కార్యకలాపాల్లేవు. 


ఇటీవల చర్చల్లో వైసీపీ విధానాలను సమర్థిస్తూ వ్యఖ్యలు


లోక్‌సత్తా జేపీ సోషల్ మీడియాతో పాటు మీడియా చర్చల్లో తరచూ పాల్గొంటూ ఉంటారు. ఇటీవల   ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ గురించి పెద్ద రచ్చ జరుగుతున్న టైమ్‌లో.. ఆ వ్యవస్థను జేపీ సమర్థించారు.  ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆప్కాబ్ బ్యాంక్ కార్యక్రమంలో జేపీ పాల్గొన్నారు. నిజానికి ఆప్కాబ్‌తో  జేపీకి  ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడో దశాబ్దాల కిందట ఆప్కాబ్ చైర్మన్ గా పని చేశారని ఆయనను పిలిచారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.   ప్రభుత్వ కార్యక్రమాల్లో అది కూడా జగన్‌తో కలిసి స్టేజ్ పంచుకోవడంతో  ఆయన వైసీపీలో చేరికపై చర్చ ప్రారంభమయింది. వైసీపీో చేరడమా లేకపోతే వైసీపీ మద్దతుతో  విజయవాడ  లేదా గుంటూరు  ఎంపీగా పోటీ చేయడమా అనే డైలమాలో ఉన్నారని అంటున్నారు.  


రెండు వైపుల నుంచి గుంభనం !


రెండు, మూడు రోజుల నుంచి జేపీ, వైసీపీ బంధం గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నా అటు వైసీపీ కానీ.. ఇటు జయప్రకాష్ నారాయణ వర్గాలు కానీ స్పందించలేదు.  ప్రస్తుతం జయప్రకాష్ నారాయణ లాంటి నేత వస్తే వైసీపీ వద్దనే అవకాశం లేదు. చేర్చకుంటారు.. ఎంపీ టిక్కెట్ కూడా ఇస్తారని అంటున్నారు. కానీ జేపీ చేరుతారా అన్నదే కీలకం. ఆయన ఓ మేధావిగా సమాజంలో ఇమేజ్ తెచ్చుకున్నారు. తన పార్టీ కాకపోతే ఆయన తన స్థాయికి తగ్గట్లుగా బీజేపీ వంటి జాతీయ పార్టీలో చేరుతారని అంటున్నారు. కానీ వైసీపీలో ఎందుకు చేరుతారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. లకానీ రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ఇరువురూ గుంభనంగా ఉంటున్నారంటే..ఏదో  ఒకటి జరిగినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది.