శరీరంలోని జ్ఞానేంద్రియాలు మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయనేది మీకు తెలిసిందే. వాటిలో ఏ ఒక్కటి లోపం ఉన్నా కష్టమే. అయితే, అవి మన శరీరంలో జరిగే మార్పులను కూడా తెలియజేస్తాయని బ్రిటన్ నిపుణులు చెబుతున్నారు. ఇంద్రియాలు ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదకర లక్షణాలను బయటపెట్టవచ్చు. కనుక జాగ్రత్తగా గమనించడం అవసరం అని తెలుపుతున్నారు. మనలో చాలా మంది కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. అయితే, ఆ సమస్యను గుర్తించలేక అనారోగ్యాలకు గురవ్వుతున్నారు.


కొలెస్ట్రాల్‌ను రక్తంలో పేరుకుపోయిన కొవ్వుగా చెప్పవచ్చు. ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ శరీర కణాల నిర్మాణానికి అవసరం. అయితే కొన్ని సార్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగిపోయి ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతాయి.


సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం, పొగతాగే అలవాటు, ఆల్కహాల్ అలవాటు వంటి వన్నీ కూడా రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగేందుకు కారణం అవుతాయి. రక్తంలో పెరిగిన కొవ్వు రక్తనాళాల గోడల మీద పేరుకుంటుంది. కొలెస్ట్రాల్ పరిమితికి మించి పేరుకుంటే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఇవి గుండె పోటు వంటి ప్రాణాంతక పరిస్థితికి దారి తీస్తుంది.


దీన్ని రక్తపరీక్షతో నిర్ధారిస్తారు. అయితే శరీరంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టు అనుమానించాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో కళ్లు, పాదాలతో పాటు చెవుల్లో కూడా అధిక కొలెస్టాల్ ఉన్నపుడు సూచనలు కనిపిస్తాయట.


వినికిడిలో వచ్చిన మార్పులు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కావచ్చని పీటర్ బైరోమ్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. కొలెస్ట్రాల్ ఉందనేందుకు ఇది కచ్చితమైన సంకేతం కాకపోయినా వినికిడి శక్తి మీద కూడా ఒక దృష్టితో ఉండాలనేది ఆయన అభిప్రాయం. చెవి పనితీరు రక్తప్రసరణ మీద ఆధారపడి ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరిగినపుడు రక్త ప్రసరణలో అంతరాయం వల్ల చెవి పనితీరు మందగించవచ్చట.


లోపలి చెవిలోని సున్నితమైన అవయవాలకు రక్తప్రసరణ మందగిస్తే అది వినికిడి లోపానికి కారణం అవుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి పెద్ద శబ్దాలు వినలేరు. క్రమంగా వినికిడి కోల్పొయ్యే ప్రమాదం కూడా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినికిడి లోపం సమస్యతో వచ్చే ఎవరికైనా సరే ఈఎన్టీ డాక్టర్లు కొలెస్ట్రాల్ పరీక్షలు కూడా చేయించాలని సూచిస్తున్నారు. సమయానికి చికిత్స అందించకపోతే సమస్య తీవ్రమవుతుంది.


కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్ధారించేందుకు రక్తపరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో సమస్య నిర్ధారించబడితే జీవన శైలిలో ప్రత్యేక మార్పులు చేసుకోవడం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో మందులు కూడా వాడాల్సి రావచ్చు. కొలెస్ట్రాల్ ప్రాణాంతకం. కనుక ప్రతి చిన్న సూచనను కూడా గమనించి ఎప్పటికప్పుడు నిర్ధారించుకోవడం అవసరమని నిపుణుల సూచన.


Also read : ఇంట్లో కాలుష్యానికి కారణమయ్యే వస్తువులు ఇవే - ‘ఊపిరి’ ఆపేస్తాయ్, జాగ్రత్త!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial