ప్రపంచంలో కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య మధుమేహం. దీన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే మరిన్ని సమస్యలు మీద పడడం ఖాయం. అలాగే అధిక రక్తపోటు చాప కింద నీరులా పాకిపోతోంది. మధుమేహం, రక్తపోటు ఈ రెండు సమస్యల వల్ల మరిన్ని వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ రెండూ నియంత్రణలో లేకపోతే వారిలో పక్షవాతం వచ్చే ఛాన్సు కూడా అధికమేనని వైద్యులు చెబుతున్నారు. పక్షవాతం రావడానికి వయసుతో సంబంధం లేదు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారిలో 30 శాతం మందిలో శాశ్వతంగా చేయి లేదా కాలుకు పక్షవాతం వస్తోంది. దీనివల్ల జీవితాంతం వైకల్యంతో బాధపడాల్సి వస్తోంది.
మధుమేహం ఉన్న వారిలో...
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు పక్షవాతం విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలి. మధుమేహాన్ని నియంత్రణంలో ఉంచుకుంటే ఏ సమస్యా రాదు. అలాగే బరువు కూడా పెరగకుండా చూసుకోవాలి. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. స్వీట్లు, గ్లైసెమిక్ ఇండెక్స్, మసాలా ఆహారాలను అధికంగా తినడం తగ్గించాలి. ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుని వైద్యులకు చూపిస్తుండాలి. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మందులు వాడుతూ అదుపులో ఉంచుకుంటే 45 శాతం వరకు పక్షవాతం వచ్చే అవకాశాన్ని అడ్డుకోవచ్చు.
వెంటనే ఆసుపత్రికి
అనుకోకుండా పక్షవాతం పడినప్పుడు చాలా తక్కువ సమయంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కాళ్లు, చేతులు వంకర పోవడం, ఉన్నట్టుండి కింద పడిపోవడం, తల తిరిగినట్టు అవ్వడం, మూతి వంకర పోవడం ఇవన్నీ పక్షవాతం లక్షణాలు. ఇలా ఏది జరిగినా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఎమెర్జన్సీ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా అడ్డుకోవచ్చు. మళ్లీ పరిస్థితి నార్మల్ అయిపోతుంది. అదే ఆలస్యం అవుతున్న కొద్దీ పరిస్థితి చేయిజారి శాశ్వత వైకల్యం వచ్చే అవకాశం ఉంది.
వారసత్వంగా...
కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ బారిన పడి ఉంటే... తరువాతి తరాలు స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. అంటే తల్లిదండ్రులు, తాతనాన్నమ్మలు, అమ్మమ్మల్లో ఎవరికైనా స్ట్రోక్ వచ్చి పక్షవాతం బారిన పడితే వారి కొడుకులు, కూతుళ్లు, మనవళ్లకు కూడా ఇదొచ్చే అవకాశం ఉంది. ధూమపానం అధికంగా చేసేవారిలో కూడా స్టోక్ వచ్చి పక్షవాతం రావచ్చు. అధిక బరువు, శరీరంలో చేరిన కొలెస్ట్రాల్ వల్ల కూడా పరిస్థితులు దిగజారచ్చు.
Also read: గర్భనిరోధక మాత్రలను వాడుతున్నారా? ఈ చెడు ప్రభావాలు తప్పకపోవచ్చు
Also read: ఎవరికీ ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే’ అని విషెస్ చెప్పకూడదు, ఎందుకో తెలుసా?