CJI Justice NV Ramana on KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) ప్రశంసలు కురిపించారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నారు. చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్ మార్క్ లాంటి వారు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో న్యాయ వ్యవస్థ అగ్ర పథాన ఉండాలని ఆయన పడుతున్న తపనకు, ఆయన వరాలజల్లుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవ్యవస్థలో దాదాపు 4,320 ఉద్యోగాల్ని కేసీఆర్ (KCR) క్రియేట్ చేశారని గుర్తు చేశారు. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిస్తున్న క్రమంలో ఇక్కడ మాత్రం పెంచడం ప్రశంసనీయమని కొనియాడారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు 2022 (Telangana State Judicial Officers Conference 2022) జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు.



హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ లాంటిదాన్ని కూడా ఏర్పాటు చేయడం, అందుకు స్థలం, నిధులు కేటాయించడం పట్ల కూడా జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అది కేసీఆర్ వల్లే సాధ్యమని, దాని ఏర్పాటు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.


న్యాయమూర్తులు, న్యాయసిబ్బంది అంతా కరోనా భయం నుంచి బయటపడాలని ఇకపై కోర్టులకు కోసం సీరియస్‌గా అదనపు సమయం వెచ్చించాలని జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) కోరారు. పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. లక్ష్య సాధన కోసం సమర్థమైన విధానాలు చాలా మంచి ఫలితాలు చూపుతాయని అన్నారు. న్యాయవ్యవస్థ కీర్తి పతాక రెపరెపలాడేలా అంతా పని చేయాలని కోరారు. జిల్లా కోర్టుల వ్యవస్థ అనేది మొత్తం న్యాయ వ్యవస్థకు పునాది లాంటిదని, ఆ పునాది గట్టిగా ఉంటేనే న్యాయవ్యవస్థ బలంగా ఉంటుందని అన్నారు.







తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు ఏం అవసరమో అన్నీ సమకూర్చుతున్నారని సీజేఐ ఎన్వీ రమణ కొనియాడారు. తెలంగాణ హైకోర్టులో బెంచ్‌లను 24 నుంచి 41కి పెంచామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొదటిసారి ఇలాంటి సదస్సు నిర్వహించుకుంటున్నామని, అందుకు ఆనందంగా ఉందని అన్నారు. 


అంతకుముందు, న్యాయాధికారులను ఉద్దేశించి అధికారికంగా ఆంగ్లంలో మాట్లాడిన సీజేఐ.. అనంతరం ముఖ్యమంత్రి గురించి తెలుగులో ప్రసంగించారు. తెలుగు నేలపై, తెలుగు వాడిగా తనకు తెలుగులో మాట్లాడాలనే ఉంటుందని జస్టిస్ ఎన్వీ రమణ అంటూ తెలుగులో ప్రసంగించారు.