Paddy Procurement From Today In Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని నేటి నుంచి కొనుగోలు చేయనున్నారు. దీంతో నేటి నుంచి రైతులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లైన్ కట్టారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలుపై అడిషనల్‌ కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారులతో బుధవారం మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ముందుగా పంట చేతికొస్తున్న ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పారు. మే మొదటి వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతాయని, జూన్‌ మొదటివారంలోగా కొనుగోలు పూర్తిచేస్తామని చెప్పారు. 


లక్ష్యం ఎంతంటే..
ఈ యాసంగిలో రాష్ట్రంలో 36 లక్షల ఎకరాల్లో వరి సాగు అవ్వగా.. 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ర్టాల ధాన్యం తెలంగాణలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో 51 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు.


డబ్బులు 3 రోజుల్లోనే..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో కేవలం 3 రోజుల్లోనే డబ్బు జమ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోలుకు రూ.16 వేల కోట్లు అవసరం అవుతుందని, ఈ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 


కొనుగోలు కేంద్రానికి రైతు తాను ధాన్యాన్ని తీసుకెళ్లినప్పుడు అతని ఆధార్‌ నంబరు ఆధారంగా ఆ రైతు ఎన్ని ఎకరాల్లో వరి వేశాడు? ఎంత దిగుబడి వస్తుందనే వివరాలన్నీ వచ్చేలా ఏర్పాటు చేశామని చెప్పారు. రైతు ఫోన్‌కు ఓటీపీ వెళ్లిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేస్తారని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులందరూ ఒక్కసారే రాకుండా టోకెన్ల పద్ధతిని అమలు చేయనున్నట్టు తెలిపారు.


ఈ సీజన్‌లో లక్ష్యంగా పెట్టుకున్న 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కోసం 1.6 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 8 కోట్ల గోనె సంచుల సేకరణకు 25న టెండర్లు పిలవనున్నారు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 236 కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటుచేశారు.