గుడ్ ఫ్రైడే క్రైస్తవ సోదరులకు పుణ్యదినం. అన్ని పండుగల రోజున హ్యాపీ ఉగాది, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ రంజాన్... ఇలా శుభాకాంక్షలు పంపుతాం. కానీ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఇలా ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే’ అని మాత్రం విషెస్ చెప్పకూడదు. క్రైస్తవ సోదరులు కూడా ఒకరికొకరు ఇలా చెప్పుకోరు. దానికి కారణం గుడ్ ఫైడే ఆనందంతో జరుపుకునే వేడుక కాదు, తమ దేవుడు యేసుకు సంతాపాన్ని తెలియజేసే పవిత్ర దినం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించరు. 


బైబిల్ ప్రకారం దేవుని బిడ్డ అయిన యేసును కొట్టి, శిలువ వేశారు. ఆయన శిలువపైన మరణించారు.దాదాపు ఆరు గంటల పాటూ శిలువపైనే విపరీతమైన బాధను అనుభవించారు. ఒక పెద్ద అరుపుతో తన చివరి శ్వాసన విడిచిపెట్టారు. అప్పుడు లోకమంతా చీకటిగా మారిపోయిందని, పెద్ద భూకంపం వచ్చినట్టు భూమి కంపించిందని చెప్పుకుంటారు. యేసును శిలువ వేసిన ఏ రోజునో ఖచ్చితమైన తేదీపై ఏకాభిప్రాయం లేదు. శుక్రవారమే ఇది జరిగిందని మాత్రం చెబుతారు. యేసు మరణానికే కాదు, ప్రపంచ పాపాలకు ఇది సంతాపదినం. సంతాపదినం రోజున ‘హ్యాపీ గుడ్ ఫైడే’ అని చెప్పలేం కదా,అవి మతపరమైన మనోభావాలను దెబ్బతీయవచ్చు. 


ఫ్రైడే ముందు ‘గుడ్’ ఎందుకు?
యేసు చనిపోయిన రోజుగా ఈ శుక్రవారాన్ని పరిగణిస్తుంటే ‘గుడ్’ అనే పదాన్ని ఎందుకు చేర్చారు అనే అనుమానం కూడా చాలా మందిలో ఉండొచ్చు. ఈ శుక్రవారం వేడుక చేసుకునే సందర్భం కాకపోవచ్చు.  కానీ ఈ దినం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే యేసు ప్రజలను రక్షించేందుకే బలయ్యారు. అందుకే ఆయన చనిపోయిన శుక్రవారానికి ముందు ‘మంచి’ పదం చేరింది. 


క్రైసవ సోదరులు ఈ రోజున చర్చిని సందర్శించి, ఉపవాసాలు పాటిస్తారు. కొన్నిచోట్ల భక్తులు క్రీస్తు శిలువ ఘటనను నాటిక రూపంలో ప్రదర్శిస్తారు. ఇది యేసు జీవితంలోని చివరి ఘట్టం కనుక దీన్ని ‘పాషన్ ఆఫ్ జీసస్’ అని కూడా పిలుస్తారు. గుడ్ ఫ్రైడేను హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. 




Also read: అందంగా ఉండడమే ఆ గ్రామానికి శాపమా? వద్దన్నా వస్తున్న పర్యాటకులు