ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్‌కి ఇది నాలుగో గెలుపు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (87 నాటౌట్: 52 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్ధశతకం చేశాడు. తనతో పాటు అభినవ్ మనోహర్ (43: 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (31 నాటౌట్: 14 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన పరుగులు చేశారు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.


193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్ జోస్ బట్లర్ (54: 24 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మొదటి ఓవర్ నుంచే బౌండరీల మోత మోగించేసిన బట్లర్ అర్థ శతకం చేసిన అనంతరం అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వారంతా విఫలం కావడం, షిమ్రన్ హెట్‌మెయర్ (29: 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్), రియాన్ పరాగ్ (17: 15 బంతుల్లో ఒక ఫోర్) కాసేపు క్రీజులో నిలిచినా ఫలితం దక్కలేదు. చివరికి రాజస్తాన్ 20 ఓవర్లలో 155-9 స్కోరుకే పరిమితమైంది.