Light Rain in Telangana Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు. ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే రెండు రోజులూ వానలు పడతాయని హైదరాబాద్‌, అమరావతిలోని వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అంచనా వేసింది. ఈ మేరకు ఆ వివరాలను గురువారం ట్వీట్ చేసింది.


హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ ఉపరితల గాలులు (గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంటుంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.5 డిగ్రీలుగా ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.






ఇక తెలంగాణలో వచ్చే 5 రోజులకు సంబంధించి వాతావరణం ఇలా ఉండనుంది. ఈ నెల 18 వరకూ తెలంగాణలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగం) వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పసుపు రంగు అలర్ట్ ను కూడా వాతావరణ కేంద్రం జారీ చేసింది.


ఏపీలో వాతావరణం ఇలా..
ఏప్రిల్ 15న ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆంధ్రాలోని మిగతా జిల్లాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.


అయితే, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లో పసుపురంగు హెచ్చరికలు జారీ చేసింది.






‘‘అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనం వల్ల బంగాళాఖాతం నుంచి వచ్చే తేమ గాలులు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు మరో మూడు గంటల సమయంలో ఏర్పడనుంది. రాయచోటికి పారిసర ప్రాంతంలోని శేషచాల అటవీ ప్రాంతం దగ్గర కొంత వర్షాలు ఇప్పుడు మొదలైంది. ఇది ఆన్నమయ్య జిల్లా (రాయచోటి సైడ్) పలు భాగాల్లోకి విస్తరించనుంది. మరో వైపున తమిళనాడులో ఏర్పడుతున్న మేఘాల వల్ల చిత్తూరు జిల్లా వి.కోట​, పలమనేరు సైడ్ లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు.