తొలిసారిగా ఓ భారత సంస్థ ఉద్యోగులకు ఆఫీసులో అధికారికంగా నిద్రపోయే హక్కును ఇచ్చింది.ఆ సంస్థ యజమాని ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. బెంగళూరుకు చెందిన సంస్థ ‘వేక్‌లిఫ్ట్ సొల్యూషన్స్’. ఈ కంపెనీ సీఈవో చైతన్య రామలింగ గౌడ. ఆయన తమ సంస్థ ట్విట్టర్ ఖాతాలో ‘అధికారిక నిద్ర సమయం’ కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఆ పోస్టులో తమ ఉద్యోగులకు పంపించిన మెయిల్‌నూ జత చేశారు. ఆ పోస్టు ప్రకారం ఉద్యోగులంతా మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండున్నర వరకు పవర్ న్యాప్స్‌కు కేటాయించాలని చెప్పారు. త్వరలో నిద్రపోయేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. నిశ్శబ్ధంగా ఉండే గదుల, నిద్రపోయేందుకు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. 


ఎందుకిలా?
ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వ విద్యాలయం, నాసా వంటి సంస్థలు చేసిన అధ్యయనంలో మధ్యాహ్నం నిద్ర ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని, సృజనాత్మకతను, ప్రొడక్టవిటీని పెంచేందుకు సహాయపడతుందని తెలిపింది. 26 నిమిషాల పాటూ నిద్రపోతే 33 శాతం పనితనం పెరుగుతుందని చెప్పింది. అందుకే తమ ఉద్యోగులకు పవర్ న్యాప్స్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు చైతన్య రామలింగగౌడ. ఏది ఏమైనా ఆ సంస్థ ఉద్యోగులు మధ్యాహ్నం భోజనం చేశాక అరగంట పాటూ కచ్చితంగా నిద్రపోవాల్సిందే. ఒకవేళ నిద్రపట్టకపోతే కాసేపు కళ్లు మూసుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిందే. 



ఎందుకు పవర్ న్యాప్స్?
పని మధ్యలో కాసేపు నిద్రపోతూ విశ్రాంతి తీసుకోవడాన్ని పవర్ న్యాప్ అంటారు. ఇది మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. దీన్ని ‘షార్ట్ అండ్ స్వీట్’ నిద్రగా చెప్పుకోవచ్చు. జపాన్లో పవర్ న్యాప్స్ పద్ధతి అధికంగా వాడుకలో ఉంది. కొన్నిసంస్థలు ఈ చిన్న నిద్రను ప్రోత్సహించడానికి కారణం వాటి వల్ల కలిగే ప్రయోజనాలే. 


1. పవర్ న్యాప్ పనితీరును మెరుగుపడేలా చేస్తుంది. ఉద్యోగి పనిలో చేసే మిస్టేక్స్ తగ్గుతాయి. 
2. ఇది ఉద్యోగి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. పనిలో అప్రమత్తతను పెంచుతుంది.  జ్ఞాపకశక్తిని పెంచడమే కాక ఏకాగ్రతను పెంచుతుంది. 
3. ఉద్యోగులకు తగినంత విశ్రాంతి లేకపోతే ప్రొడక్టవిటీ తగ్గిపోతుంది. ఒక పూటంతా పనిచేసి అలసిపోయిన ఉద్యోగులకు రెండో పూట సమర్థవంతంగా పనిచేయాలంటే కాసేపు నిద్ర అవసరం. 
4. చంటిపిల్లల తల్లులకు ఈ పవర్ న్యాప్స్ మరీ అవసరం. ఇంట్లోపనితో అలసిపోయిన వారికి ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే ఇలాంటి విశ్రాంతి అత్యవసరం. 


Also read: ట్యూబెక్టమీ లేదా వాసెక్టమీ, పిల్లలు పుట్టకుండా ఏ ఆపరేషన్ బెటర్?




Also read: పిల్లల దుస్తుల్లో 60 శాతం విష రసాయనాలు, గ్రీన్ సర్టిఫికెట్ అబద్ధమే