ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న అంబటి రాంబాబుపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంబటి  రాంబాబు ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో బయట ప్రపంచానికి తెలుస్తాయని అయ్యన్న ప్రకటించారు. ఇవేమీ రహస్యం కాదని సీఎం సహా చేరాల్సిన వారి దగ్గరకు చేరాని త్వరలో అంబటి రాంబాబును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం ఖాయమని ఆయన ట్వీట్ చేశారు. అయ్యన్నపాత్రుడు ట్వీట్ వైరల్ అవుతోంది. 



అంబటి రాంబాబుపై కొద్ది రోజులుగా అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.  మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ విషయంలో అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలకూ కౌంటర్ ఇచ్చారు. 



అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం గతంలో అంబటి రాంబాబుపై ఈ తరహా ఆరోపణలు ఉండటమే. గతంలో సంజనా అనే మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే తనను ట్రాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఇటీవల సుకన్య అనే మహిళతో మాట్లాడినట్లుగా ఆడియో టేపులు బయటకు వచ్చాయి. అవి తనవి కాదని అంబటి రాంబాబు ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పేరుతో మార్ఫింగ్ ఆడియోలు రిలీజ్ చేసినా పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడంతో అవి ఆయనవేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది.


ఇప్పుడు మహిళా జర్నలిస్టు విషయంలోనూ ఆయన అంతే అసభ్యంగా మాట్లాడినట్లుగా అయ్యన్న చెబుతున్నారు. పైగా వాటికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని.. వాట్సాప్ రికార్డులని ఆయన చెబుతున్నారు.పైగా ప్రభుత్వ పెద్దలకూ చేరినట్లుగా చెబుతున్నారు.దీనిపై వైఎస్ఆర్‌సీపీ నేతలు కానీ అంబటి రాంబాబు కానీ ఇంకా స్పందించలేదు.