ఆధారాలు లేని ఆరోపణలు ఆపకపోతే బండి సంజయ్‌పై లీగల్ యాక్షన్ తీసుకుంటాని  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ .. టీ బీజేపీ అధ్యక్షుడు బండి  సంజయ్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో హెచ్చరికాలు జారీ చేశారు. బండి సంజయ్ తన పాదయాత్రలోని ఓ సభలో మాట్లాడుతూ తెలంగాణలో 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోవడానికి కేటీఆర్ కారణం అన్నారు. అయినప్పటికీ కేటీఆర్‌పై కేసీఆర్ చర్యలు తీసుకోలేదన్నారు. ఈ వీడియోను తెలంగాణ బీజేపీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు. ఇలాంటి నిరాధారణ ఆరోపణలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉన్నా ప్రజల ముందు పెట్టాలని లేకపోతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 



 
గత ఏడాది డిసెంబర్‌లో  విడుదలైన ఇంటర్​ ఫలితాల్లో 51 శాతం మంది విద్యార్థులు  ఫెయిల్​ అయ్యారు. ఈ కారణంగా పలువురు విద్యార్థులు మనస్థాపానికి గురై.. బలవన్మరణాలకు పాల్పడ్డారు.  ఓ విద్యార్థి ఏకంగా తన మరణానికి కేటీఆర్ కారణం అంటూ ట్వీట్​ చేశారు. ఇలా మొత్తం దాదాపుగా ఇరవై ఏడు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరపకపోయినా కఠినమైన పరీక్షలు పెట్టారని అందుకే బాగా చదివేవారు కూడా ఫెయిలయ్యారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి. విద్యార్థుల ఆత్మహత్యలు అంతకంతకూ పెరిగిపోతూండటంతో తెలంగాణ ప్రభుత్వం పరిస్థితిని రివ్యూ చేసి..అందర్నీ పాస్ చేయాలని నిర్ణయించుకుంది.  



అప్పుడే బీజేపీ నేతలు విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్ కారణం అని ఆరోపించడం ప్రారంభించారు. బండి సంజయ్ కూడా అప్పట్లో ఈ ఆరోపణలు చేశారు. తాజాగా పాదయాత్రలోనూ అవే ఆరోపణలు రిపీట్ చేశారు. అయితే కనీసం విద్యా శాఖ మంత్రి కూడా కేటీఆర్ కాదు. పరీక్షలతో ఆయనకు ఎలాంటి సంబందం లేదు. అయినప్పటికీ బండి సంజయ్ ఆపకుండా అవే ఆరోపణలు చేస్తూండటంతో కేటీఆర్ స్పందించారు. .