పిల్లలు దుస్తువులు, ఉత్పత్తులు ప్రత్యేకంగా తయారవుతాయి. వాటి తయారీలో పిల్లల శరీరం తట్టుకోలేని రసాయనాల జోలికి వెళ్లమని చెబుతాయి తయారీ సంస్థలు. వారి దుస్తులు, తలగడలు, దుప్పట్లు... ఇలా వారి కోసమే ప్రత్యేకంగా తయారు చేసే ఉత్పత్తులలో60 శాతం విష రసాయనాలు కలుస్తున్నట్టు ఓ కొత్త అధ్యయనం తేల్చింది. ఆ దుస్తులకు గ్రీన్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ అవి రసాయనరహిత ఉత్పత్తులు కావని, వాటిలోనూ ఫారెవర్ కెమికల్స్ అని పిలిచే  PFA పదార్ధాలను కలిగి ఉంటున్నట్టు గుర్తించారు. 


'ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ' జర్నల్‌లో ఈ అధ్యయనం తాలూకు వివరాలను ప్రచురించారు. వాటర్ ప్రూఫ్, స్టెయిన్ రెసిస్టెంట్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వంటి లేబుల్స్ ఉన్నప్పటికీ అవి రసాయనరహిత ఉత్పత్తి అని భావించడానికి లేదని, వాటిల్లో కూడా హానికరమైన PFA రసాయనాలు ఉన్నాయని తేలింది. యూకేకు చెందిన శాస్త్రవేత్త మాట్లాడుతూ ‘పిల్లల శరీరాలు అభివృద్ధి చెందే దశలోనే ఉంటాయి. ముఖ్యంగా రసాయనిక ప్రభావాలకు సున్నితంగా ఉంటాయి’ అని చెప్పారు. 


అధ్యయనం ఇలా సాగింది...
పిల్లలు, యువత వాడే 93 రకాల విభిన్న ఉత్పత్తులను పరిశోధకులు పరీక్షించారు. పరుపులు, కాస్మోటిక్స్, దుస్తులు ఇలా అందులో అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేకంగా ‘స్టెయిన్ రెసిస్టెంట్’, ‘వాటర్ రెసిస్టెంట్’, గ్రీన్, నాన్ టాక్సిక్, ఎకో అని లేబుల్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకున్నారు. వాటన్నింటిలోనూ PFA (Perfluoroalkoxy alkanes)లు ఉన్నట్టు గుర్తించారు. PFAలను చాలా సంస్థలు ఉత్పత్తులను నాన్ స్టిక్, వాటర్ ప్రూఫ్, స్టెయిన్ రెసిస్టెంట్ గా మార్చేందుకు వాడతారు. ఫుడ్ ప్యాకేజింగ్, కాస్మోటిక్స్, డెంటల్ ఫ్లాస్ వంటి రోజువారీ ఉత్పత్తులలో కూడా వీటి ఉనికి అధికంగా ఉంటుంది. 


ఈ రసాయనాలు ఎంత ప్రమాదకరమైనవంటే  పుట్టుకతో వచ్చే లోపాలు, కాలేయ సమస్యలు, థైరాయిడ్, రోగనిరోధక శక్తి తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత వంటివి ఈ రసాయనాలతో అనుసంధానమై ఉన్నాయి. ఈ PFA రసాయనాలు మానవ శరీరంలో సూక్ష్మరూపంలో చేరి పేరుకుపోతాయి.  అవి సహజంగా విచ్ఛిన్నం కావు.శరీరంలో చేరి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. 


ఆలోచించాల్సిందే...
గ్రీన్ సర్టిఫికెట్ ఉన్న దుస్తులు, ఉత్పత్తుల్లో కూడా ప్రమాదకరమైన PFAలు వాడుతున్నప్పుడు వాటికి ఆ సర్టిఫికెట్ ఇచ్చి ఉపయోగం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. గ్రీన్ సర్టిఫికెట్ ను జారీ చేసేవారు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని సమీక్షించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గ్రీన్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు ఆలోచించాలని సూచిస్తున్నారు. 


Also read: సెలెబ్రిటీలు వీగన్లుగా ఎందుకు మారుతున్నారు? ఈ డైట్ వల్ల లాభాలేంటి?