మనదేశంలో ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని కోరుకునేవారు ఎక్కువున్నారు. కొంతమంది ఒకరిని కనగానే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకుంటున్నారు. మరికొందరు ఇద్దరు పిల్లల వరకు వెయిట్ చేస్తున్నారు. పిల్లలు పుట్టకుండా చేసే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ విషయంలో భార్యాభర్తల్లో బోలెడన్నీ సందేహాలు ఉన్నాయి. ట్యూబెక్టమీ చేయించుకోవాలా? లేక వాసెక్టమీ చేయించుకోవాలా? అని చర్చలు నడుస్తూనే ఉంటాయి. కానీ కుటుంబ నియంత్రణ అనగానే మహిళలకే ట్యుబెక్టమీ చేయించేవాళ్లు అధికం.ఆ రెండూ ఎలా చేస్తారో తెలుసుకుంటే వారి సందేహాలు కూడా తీరుతాయి.
ట్యూబెక్టమీ ఎలా చేస్తారు?
మహిళలకు పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ ట్యూబెక్టమీ. ఇది శాశ్వతమైన కుటుంబ నియంత్రణ పద్దతి. ఈ ఆపరేషన్ అయ్యాక మళ్లీ గర్భం దాల్చే అవకాశం ఉండదు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫాలోపియన్ నాళాలు చాలా ముఖ్యపాత్ర వహిస్తాయి. స్త్రీల అండాశయం నుంచి అండము విడుదలై ఫాలోపియన్ నాళాల ద్వారానే గర్భాశయంలోకి వెళ్లి అక్కడ వీర్యకణాలతో కలిసి ఫలదీకరణం చెందుతుంది. అప్పుడు గర్భం ఏర్పడుతుంది. అసలు అండం గర్భశయంలోకి చేరకపోతే గర్భం దాల్చే అవకాశం సున్నా. అందుకే ట్యూబెక్టమీలో ఫాలోపియన్ నాళాలను కత్తిరించి వేరు చేస్తారు. ఈ ఆపరేషన్ కోసం సిజేరియన్ పద్ధతిలో ఇచ్చినట్టే వెన్నుపూసకు అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చి చేస్తారు.
ట్యూబెక్టమీ మంచిదే
మహిళలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ వారి ఆరోగ్యానికి కూడా మంచిదే. భవిష్యత్తులో అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. అండాశయ క్యాన్సర్ ఉన్న చాలా మంది మహిళలు తమ ఫాలోపియన్ నాళాలను ఆపరేషన్ ద్వారా తీయించేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
వీరు జాగ్రత్త
ట్యూబెక్టమీ చేయించుకోవాలనుకు మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. గతంలో పొట్ట భాగంలో ఆపరేషన్లు అవ్వడం, మధుమేహం ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్నవారు వైద్యులతో మాట్లాడాకే ఈ శస్త్రచికిత్సకు సిద్ధమవ్వాలి.
వాసెక్టమీ చాలా సులువు...
మగవారికి చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఇది.కేవలం పదినిమిషాల్లో ఈ ఆపరేషన్ అయిపోతుంది. వీర్యకణాలు ప్రవహించే వీర్యవాహికలను కత్తిరించడం ద్వారా దీన్ని పూర్తిచేస్తారు. అంగానికి కింద ఉండే బీజకోశాల్లో వీర్యవాహికలు ఉంటాయి. బీజకోశాలకు అర అంగుళం మేర కోసి అందులోనుంచి వీర్య వాహికలను బయటికి తీసి కత్తిరిస్తారు. ఇలా కత్తిరించాక చివర్లు ముడివేసి తిరిగి యథాస్థితిలో పెట్టి చర్మాన్ని కుట్టేస్తారు. ఇది మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక చేస్తారు. కాబట్టి నొప్పి తెలియదు. ఈ ఆపరేషన్ లైంగిక జీవితంపై ఎలాంటి ప్రభావం పడదు.
భార్యాభర్తలు ఆరోగ్యాన్ని వారిలో ఎవరు ఆపరేషన్ చేయించుకోవాలో నిర్ణయించుకోవడం ఉత్తమం.
Also read: మీకు ఇందులో ఎన్ని గుర్రాలు కనిపిస్తున్నాయి? మీరే చెప్పే సంఖ్యే మీరెలాంటి వారో చెబుతుంది