గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర క్రిస్టీనా భర్త కత్తెర సురేష్ పై తీవ్రమైన అభియోగాలతో రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి విదేశాల నుంచి అక్రమంగా విరాళాలు తీసుకోవడం కాగా మరొకటి దత్తత పేరుతో మైనర్లను నిబంధనలకు విరుద్ధంగా వేరే దేశాలకు తరలించారన్నది. కత్తెర సురేష్ హర్వెస్ట్ ఇండియా సొసైటీ పేరుతో మత పరమైన సంస్థను నడుపుతున్నారు. స్వచ్చంద సంస్థగా చెబుతూ విదేశాల నుంచి విరాళాలు తీసుకొచ్చేవారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మతపరమైన సంస్థలు విదేశాల నుంచి విరాళాలు తేవడాన్ని నియంత్రించింది. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని కఠఇనతరం చేసింది.
అయినప్పటికీ ఎఫ్‌సీఆర్ఏ చట్టాన్ని ఉల్లంఘించి పెద్ద ఎత్తున విదేశీ విరాళాలను కత్తెర సురేష్ సేకరించినట్లుగా ఆధారాలు బయటపడ్డాయి. దీంతో సిబిఐ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల స్వీకరణల విషయంలో నిబంధనలు ఉల్లంగిస్తున్న అనేక మత మార్పిడి సంస్థలపై కేంద్రం కొరడా ఝళిపించింది. బుధవారం దేశవ్యాప్తంగా 40 చోట్ల సీబీఐ సోదాలు జరిపింది. విదేశీ విరాళాల స్వీకరణలో నిబంధనలు ఉల్లంఘించిన స్వచ్ఛంద సంస్థల నుంచి ముడుపులందుకున్న ఐదుగురు ప్రభుత్వ అధికారులతోపాటు 10 మందిని అరెస్ట్ చేసింది. విదేశీ నిధుల స్వీకరణలో విదేశీ నిధుల నియంత్రణ చట్టం ఉల్లంఘించిన వారికి క్లియరెన్స్ ఇవ్వడానికి కొందరు అధికారులు ముడుపులు స్వీకరించారని సీబీఐ ప్రకటించారు. కత్తెర సురేష్ నడుపుతున్న సంస్థ కూడా ఇలా నిబంధనలకు విరుద్ధంగా పండ్స్ విదేశాల నుంచి తీసుకువచ్చినట్లుగా తేలడంతో కేసు నమోదు చేశారు.
అదే సమయంలో ఈ సంస్థ భారతీయ అనాథలైన చిన్నపిల్లల్ని అక్రమంగా విదేశాలకు తరలించిన అభియోగాలు కూడా ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కు బాలల హక్కుల జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అక్రమంగా మైనర్ లను దత్తత తీసుకోవడం , అక్రమంగా విదేశాలకు తరలింపు పై జాతీయ కమిషన్ లో కేసు నమోద అయింది. కత్తెర సురేష్ దంపతులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది.
కత్తెర హెన్రీ క్రిస్టినా గతంలో తాడికొండ అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో టిక్కెట్ లభించలేదు. స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలవడంతో సీఎం జగన్ ఆమెకు జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ ఇద్దరే అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేశారని.. ఆమెపై కోర్టులో కొంత మంది పిటిషన్లు దాఖలు చేశారు.