V Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఎన్నికల సంఘం వద్ద ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనపై అఫిడవిట్ విషయంలో ఆరోపణలు వచ్చాయి. తొలుత సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత మార్చినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తాజాగా వాటిని విచారణ జరిపిన ఈసీ ఆ ఫిర్యాదులను కొట్టేసింది. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపామని, ఎలాంటి తప్పిదం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన కలెక్టర్‌కు ఈసీ సమాచారం అందించింది.
కలెక్టర్ ధ్రువీకరణ
ఈ అంశాన్ని మహబూబ్ నగర్ కలెక్టర్ (Mahabubnagar Collector) వెంకట్రావ్ ధ్రువీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించాయని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో పని చేస్తున్న వ్యక్తులు, అధికారుల నైతిక బలాన్ని, ఐక్యతను కాపాడేలా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిందని చెప్పారు.
2018 ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత మార్చారని రాఘవేంద్రరాజు (Raghavendra Raju) గతేడాది ఆగస్టు 2న, అదే ఏడాది డిసెంబర్ 16న ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ ఎన్నికల కమిషనర్ (Telangana Election Commissioner) నుంచి నివేదిక తెప్పించుకున్నారు. మొత్తానికి మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా విచారణ జరిపి నివేదిక తయారు చేసి సీఈసీకి పంపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ సహా 25 మంది అభ్యర్థులు మొత్తం 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
మొత్తం 51 సెట్లలో 10 నామినేషన్లను రిజెక్ట్ అయ్యాయి. మరో ఆరు సెట్లు ఉపసంహరించుకున్నారు. ఇక 35 సెట్ల నామినేషన్లు మిగిలాయి. ఒక్కో అభ్యర్థికి ఒక్క సెట్ సక్రమమైన నామినేషన్ చొప్పున 14 పోగా.. మిగిలిన 21 మల్టిపుల్ లేదా డూప్లికేట్ సెట్లు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో వెబ్‌జెనెసిస్ అప్లికేషన్ విధానం ప్రకారం మల్టిపుల్/డూప్లికేట్ నామినేషన్లు, వాటికి అనుసంధానమైన అఫిడవిట్లు పబ్లిక్ డొమైన్‌లో కనిపించే ఆప్షన్ లేదు. అయితే, 2018 నవంబర్ 14న శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఇతర అభ్యర్థులకు సంబంధించిన డూప్లికేట్ నామినేషన్లు, అఫిడవిట్లు కనిపించకుండా పోయాయి. వెబ్‌జెనెసిస్ అప్లికేషన్ విధానంలో ఈ అఫిడవిట్లు కనిపించకుండా పోయినందున దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేం.. చర్యలు తీసుకోలేం..’అని ఎన్నికల ప్రధాన అధికారి చెప్పారు.