Hyderabad Facebook Fraud News: “నా పేరు ఇందుషా తుమ్మల.. మాది విజయవాడ. డిగ్రీ చదివినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లి కాలేదు. ఫేస్ బుక్ ద్వారా మీరు పరిచయమయ్యాక మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా. మీ వయసు నాకంటే రెట్టింపైనా నాకు అభ్యంతరం లేదు. ఏదైనా దేవాలయానికి వెళ్లి ఇద్దరం ఒక్కటవుదాం’’ అంటూ యువతిలా పరిచయం చేసుకుని, అమ్మాయిలా మాట్లాడి జూబ్లీహిల్స్ లో ఉంటున్న ఓ వ్యాపారి నుంచి రూ.45 లక్షలు కాజేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ నేరానికి పాల్పడ్డ నిందితుడు మోతే అశోక్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఆ వివరాలను బుధవారం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మోతే అశోక్ ఫేస్ బుక్ లో అందమైన యువతి పేరుతో ఖాతా తెరిచి జూబ్లీహిల్స్ కు చెందిన ఓ వ్యాపారిని రెండేళ్ల కిందట పరిచయం చేసుకున్నాడు. దశలవారీగా అతడి నుంచి రూ.45 లక్షలు తీసుకున్నాడు. అనుమానం వచ్చిన ఆ వ్యాపారి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మోసం బహిర్గతం అయ్యిందని సీపీ వివరించారు.


యూట్యూబ్ చూసి.. వాయిస్ మార్చే యాప్ వాడి
నూజివీడులో నివాసముంటున్న అశోక్ ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేశాడు. వ్యసనాలకు బానిసై డబ్బు కోసం మోసాలు చేయాలనుకున్నాడు. ఎలా చేయాలో యూట్యూబ్ వీడియోలు చూశాడు. ఓ యువతి ఫొటోను డౌన్ లోడ్ చేసుకుని ఇందుషా తాళ్లూరి పేరుతో 2020 ఫిబ్రవరిలో ఫేస్ బుక్ ఖాతా తెరిచాడు. జూబ్లీహిల్స్ వ్యాపారికి రిక్వెస్ట్ పంపాడు. తర్వాత "వాయిస్ ఛేంజ్" యాప్ ద్వారా యువతిలా వ్యాపారితో మాట్లాడాడు. విజయవాడకు వస్తే, ఏకాంతంగా గడుపుదామంటూ ఆహ్వానించేవాడు. వచ్చే వారంలో వస్తున్నానని వ్యాపారి అంటే, వేరే పనులు ఉన్నాయంటూ దాటవేసేవాడు.


ఫీజు కట్టాలి, అమ్మకు కరోనా అంటూ..
వ్యాపారి తన మాటలకు ఆకర్షితుడయ్యాడని తెలుసుకున్న అశోక్ కళాశాలలో ఫీజు కట్టాలంటూ రూ.3 లక్షలు తీసుకున్నాడు. తొలి దశలో తన తల్లికి కరోనా సోకిందని, డబ్బు సాయం చేయాలంటూ రూ.10 లక్షలు, రెండోసారి తనకు కూడా సోకిందని రూ.15 లక్షలు తీసుకున్నాడు. తరచూ డబ్బు కోసం ఫోన్ చేస్తుండడంతో బాధితుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ జి.వెంకట రామిరెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని గుర్తించారు. నూజివీడు వెళ్లి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అశోక్ ఆన్ లైన్ గేమింగ్ యాప్‌లు, మద్యం తాగేందుకు రూ.43 లక్షలు ఖర్చు చేశాడని, భార్యాపిల్లలను కూడా సక్రమంగా పోషించడం లేదని ఇన్స్ పెక్టర్ వివరించారు.