ఏ వ్యాధి బారిన పడినా... శ్వాస తీసుకోవడం మాత్రం మెదడు మర్చిపోదు. కానీ ఓ ఆరేళ్ల పాప మాత్రం నిద్రపోతూ శ్వాస తీసుకోవడం మర్చిపోతుంది. అలా ఆమె మరణం బారిన పడే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడం మర్చిపోయి, మరణం అంచుల వరకు వెళ్లి ఎన్నోసార్లు వచ్చింది. ఇది ఒక విచిత్రమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 1000 మంది లోపే ఈ వ్యాధి బారిన పడినవారు ఉన్నారు. ఇది ఒక అస్పష్టమైన నాడీ సంబంధిత వ్యాధిగా చెబుతున్నారు వైద్యులు. పుట్టుకతోనే ఈ రోగం వస్తుంది. ఆంగ్లంలో దీన్ని ‘సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. బ్రిటన్ లోని ఆరేళ్ల పాప సాడీ ఇలా శ్వాస తీసుకోవడం మర్చిపోయే రోగంతో బాధపడుతోంది. 


సాడీ తల్లి మాట్లాడుతూ ప్రతి రాత్రి తాము తమ పాపను చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెబుతోంది. ఆమె మెదడు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతుందని, అందుకే రాత్రి పడుకునే ముందు లైఫ్ సపోర్ట్ సిస్టం పెట్టి నిద్రపుచ్చుతామని వివరిస్తోంది. లేకుంటే ఏ క్షణమైనా సాడీ శ్వాస ఆగిపోవచ్చని చెబుతోంది. 


సాడీకి శ్వాస ఆగిపోయిన క్షణంలో శరీరం నీలం రంగులోకి మారడం ప్రారంభిస్తుందని తల్లి వివరిస్తోంది. పుట్టుకతోనే సాడికీ సమస్య వచ్చిందని, కానీ పుట్టినప్పుడు అందరి పిల్లలాగే జన్మించిందని తెలిపింది. అయితే ప్రసవం అయ్యాక పాపని ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచాల్సి వచ్చిందని చెప్పింది. ఆమె శ్వాసకోశ పరిస్థితి బాగో లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. పాపకి రెండు నెలల వయసు ఉన్నప్పుడే శ్వాస తీసుకోవడానికి ఆమె మెడలో ఒక చిన్న ‘ట్రాకియోటమీ’ని పెట్టారు. దాని వల్లే సాడీ ఊపిరి పీల్చుకోగలుగుతుంది. అది లేకుండా  పాప స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. మెడలోని ఫ్రెనిక్ నరాలలో పేసర్ ఇంప్లాంట్ చేయాలి. ఇందుకోసం చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఆ సర్జరీ కావలసిన నిధులను సేకరించే పనిలో ఉంది ఆమె కుటుంబం.


సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
హార్వర్డ్ హెల్త్ చెబుతున్న ప్రకారం, సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ పుట్టుకతోనే వస్తుంది. నాడీవ్యవస్థను, శ్వాసక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు. నిద్రిస్తున్నప్పుడు శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల  రక్తంలో ఆక్సిజన్ తగ్గి, కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. దీని వల్ల మరణం సంభవిస్తుంది.



Also read: నేను ఒకే ఒకసారి నా భార్యను మోసం చేశాను, కానీ ఆమె ఎప్పటికీ నన్ను క్షమించడం లేదు










































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.