నిన్న దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి ఉన్న ద్రోణి/గాలిలోని అనిచ్చితి, ఈ రోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రం మట్టానికి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు  41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 43 డిగ్రీల మధ్యన  కొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC మరియు చుట్టు ప్రక్కల జిల్లాలలో 40 డిగ్రీల  కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.  ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో)  వీచే అవకాశం ఉంది.


తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు (30 నుంచి 40 కిలో మీటర్ల వేగం) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఇలా


‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.2 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 50 శాతం నమోదైంది. 


ఏపీలో ఎండలు ఇలా


ఏపీలో ఎండలు విపరీతం అయ్యాయి. నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వెదర్ బులెటిన్ లో తెలిపారు.


‘‘రాష్ట్రంలో ఎండలు మరింత విపరీతం కానున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో విశాఖకి తూర్పుగా అధిక పీడన ప్రాంతం కొనసాగుతోంది. దీని వలన పొడిగాలుల తీవ్రత పెరిగి రానున్న మూడు రోజుల వ్యవధిలో మధ్య ఆంధ్రా ప్రాంతం అయిన ఎన్టీఆర్ (విజయవాడ వైపు), గుంటూరు, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం పశ్చిమ భాగాలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య​, కడప​, కర్నూలు, నంధ్యాల, చిత్తూరు జిల్లాల్లో వేడి 44-45 డిగ్రీల వరకు పలు భాగాల్లో నమోదవ్వనుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వేడి 40 వరకు ఉండనుంది. అలాగే కృష్ణా, కొనసీమ​, బాపట్ల​, కాకినాడ జిల్లాల్లో 36 నుంచి 39 డిగ్రీల మధ్యలోనే వేడి కొనసాగుతుంది. విశాఖ నగరంలో కూడా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు ఉండనుంది. వేడి తీవ్రత మరో మూడు రోజుల వరకు కొనసాగనుంది.


ఢిల్లీలో విపరీతమైన ఎండలు


సోమవారం (ఏప్రిల్ 17) వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని చాలా రాష్ట్రాలు వేడిగాలుల ఉచ్చులో ఉంటాయని అంచనా. IMD ప్రకారం, రాబోయే 4 రోజులు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, దేశంలోని వాయువ్య ప్రాంతంలో రెండు రోజుల పాటు వేడి గాలులు కొనసాగుతాయి.