ప్రశ్న: మాది పెద్దలు చేసిన పెళ్లి. నా భార్య ఇంటిపట్టునే ఉండి వ్యవహారాలన్నీ చూసుకుంటూ, ఒక మంచి భార్యగా అన్ని విధాలుగా ఉంది. కానీ నేనే ఒక మంచి భర్తగా ఉండలేకపోయాను.  ఏడాది క్రితం సహోద్యోగితో కలిసి ఉన్నప్పుడు నా భార్య నన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అప్పుడు చాలా గొడవలు అయ్యాయి. బతిమిలాడి నా భార్యను మళ్ళీ ఇంటికి తెచ్చుకున్నాను. నా సహోద్యోగితో అన్ని సంబంధాలు తెంచుకున్నాను. ఆమెతో నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధాలు లేవు. ఆమెతోనే కాదు ఇతర ఏ స్త్రీతోనో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. భార్యకు క్షమాపణలు కూడా చెప్పాను. అప్పటినుంచి చాలా నిజాయితీగా ఉంటున్నాను. కానీ ఆమె నన్ను నమ్మడం లేదు. ఆమెకు నా నిజాయితీగా నిరూపించడానికి చేసిన ప్రయత్నాలతో అలసిపోయాను. ఆమె మాత్రం నాతో ప్రేమగా ఉండడం లేదు. నన్ను నమ్మడం లేదు. నేను చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతోంది. ఆమెకు నాపై మళ్లీ ప్రేమ పుట్టేలా చేయడం ఎలా?
- శ్రీ,అరకు


జవాబు: మిమ్మల్ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. మీరు చేసింది తప్పని మీకు అర్థమైంది. ఆ విషయంలో ఇప్పటివరకు మీరు పశ్చాత్తాప పడుతూనే ఉన్నారు, కానీ మిమ్మల్ని నమ్మిన మీ భార్య మాత్రం  మీ మోసాన్ని అంత త్వరగా మర్చిపోలేక పోతోంది. ఆమె సున్నిత మనస్కురాలయి ఉంటుంది. మీరు మీ భాగస్వామి నమ్మకాన్ని తిరిగి పొందాలని చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. కానీ మీరు చేసింది చిన్న మోసం కాదు, అంత త్వరగా మర్చిపోవడానికి. వేరే స్త్రీతో ఉండగా మీ భార్య మిమ్మల్ని తన కళ్ళతో చూసింది. అది ఏడాదికే మర్చిపోవడం కూడా కుదరదు. మీరు కొన్నేళ్ల పాటు ఆమె ప్రేమ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. దీనికి చాలా ఓపిక అవసరం. ఆమె మీపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను తిరిగి చూపించాలంటే మీరు ఇంకా వేచి ఉండాల్సి వస్తుంది. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడం అంత సులువు కాదు. అందులోను సున్నిత మనస్కురాలైన భార్య సాధారణ స్థితికి రావాలంటే ఆమెకు చాలా ఎక్కువ సమయమే పడుతుంది. ఏ భార్య అయినా పిల్లల విషయంలో కరిగిపోతుంది. కాబట్టి పిల్లలను ప్రేమగా చూడండి. వారితో ఎక్కువ సమయం గడపండి. ఆఫీసు అయ్యాక నేరుగా ఇంటికి వచ్చి మీ భార్యకు ఇంటి పనుల్లో సాయం చేయండి. ఫోన్ కాల్స్ మాట్లాడటం తగ్గించండి.


ఏడాది అవుతున్నా ఇంకా ఆమె మారలేదని మీలో విసుగు, చిరాకు మొదలయితే సమస్య ఇంకా జటిలమవుతుంది. ఎంత ఓపికగా ఉంటే ఆమె అంతగా మారే అవకాశం ఉంది. మీరు చేసిన మోసం, మీ భార్య చేస్తే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆమెను మీరు ఇంట్లోకి కూడా రానివ్వరు. కానీ మిమ్మల్ని క్షమించి మీతో పాటు ఇంట్లో ఉంటోంది మీ భార్య. అంటే ఆమె ఎంతో కొంత మిమ్మల్ని క్షమించిందని అర్థం. మీరు చేసిన పని గురించి పదేపదే ఆమె దగ్గర మాట్లాడడం మానేయండి. ఆమెకు భరోసా ఇవ్వడానికి ఏమి చేయాలో మీ భార్యను అడగండి. ఆమె అవసరాలను తీర్చండి. ఆమెకి విలువ ఇవ్వండి. ఇంట్లో ఆమె స్థానం గొప్పదని గుర్తు చేయండి. ఇతర స్త్రీలతో హద్దుల్లో ఉండడం మాత్రం మార్చిపోకండి. 



Also read: రాత్రిపూట ఈ ఆహారాలకు దూరంగా ఉంటే చంటి పిల్లల్లా హాయిగా నిద్రపోవచ్చు