Telangana Congress Politics :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో కాక ప్రారంభమయింది. దళిత సీఎం ప్రకటన చేయాలన్న  డిమాండ్‌ ఊపందుకుంటోంది.  మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముందుకు సాగుతున్న కొద్దీ ఈ డిమాండ్ ను కూడా ఆ పార్టీ నేతలు పెంచుకుటూ పోతున్నారు. ఇదంతా  రేవంత్‌కు చెక్ పెట్టడానికి సీనియర్ నేతలు ప్రారంభించిన గేమ్ అని రేవంత్ వర్గీయులు అనుమానిస్తున్నారు. అయితే పార్టీ హైకమాండ్ ఇలాంటి వాటిని ప్రోత్సహించదని చెబుతున్నారు. కానీ సీనియర్లు మాత్రం తమ ప్రయత్నం తాము చేయాలని అనుకుంటున్నారు. 


రేవంత్‌కు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా సీనియర్ల ప్రయత్నాలు ! 
 
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పడం కష్టం.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యర్థిపై పోరాడటం కన్నా.. తమలో తాము పోరాడుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత సీనియర్లు ఆయనపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన నాయకత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆయనే సీఎం అవుతారని.. తామంతా కష్టపడి ఆయనను సీఎం చేయాలా అనే ప్రశ్నలను కొందరు ఇప్పటికే వేశారు కూడా. అయితే పార్టీలోనే ఉండి.. రేవంత్ చెక్ పెట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నాల్లో కొత్తగా దళిత సీఎం అనే నినాదం వచ్చి చేరింది. కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు ఈ ప్రతిపాదన తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంలో కీలకంగా ఉండే ఎమ్మెల్యే జగ్గారెడ్డి దళిత సీఎం ప్రతిపాదన తాను పెట్టలేదన్నారు కానీ.. అలాంటి  ప్రతిపాదన లేదని మాత్రం చెప్పలేదు. 


మల్లు భట్టివిక్రమార్క పాదయాత్రకు వచ్చిన ఖర్గే వద్ద ప్రతిపాదన పెట్టారా ? 
 
ఇటీవల రేవంత్ రెడ్డికి పోటీగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించారు.  పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు.  మంచిర్యాలలో నిర్వహించారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే వచ్చారు.  సభలో మాట్లాడిన వక్తలందరు దళిత వాదాన్నే వినిపించారు.   రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో దళిత వర్గాలకు చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దళిత సీఎం హామీ, మూడు ఎకరాల భూ పంపిణీ ఏమైంది..? పోడు భూముల సమస్యతో పాటు కేసీఆర్‌ మంత్రి వర్గంలో సామాజిక న్యాయం కొరవడిందంటూ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఓ రకంగా  దళిత మహా గర్జన అన్నట్లుగా సభను నిర్వహించారు.   తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే మొదటి సీఎం దళితుడేనని హామీ ఇచ్చి దళిత వర్గాలను మోసం చేశారని విమర్శిస్తున్నామని, అదే కాంగ్రెస్‌లో దళిత సీఎం నినాదం తీసుకుంటే బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టవచ్చని.. దళిత వర్గాల ఓట్లన్నీ గుంపగుత్తగా పడతాయని సీనియర్లు భావిస్తున్నారు.  పార్టీ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి చూచాయగా ఈ విషయాన్ని తీసుకెళ్లారని అంటున్నారు.


హైకమాండ్ వద్దకు సమగ్ర ప్రతిపాదనలతో వెళ్లేందుకు సీనియర్ల ప్రయత్నం ! 


దళిత సీఎం నినాదం తో  ప్రజల్లోకి వెళ్తే భారీ విజయం లభిస్తుందని..  కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలిచేస్తుదంన్న అంకెలతో.. సర్వే రిపోర్టులతో వారు హైకమాండ్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఏ మాత్రం సానుకూలత తెలిపినా   టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దూకుడుకు చెక్‌ పెట్టొచ్చనే ఆలోచనతో సీనియర్‌ నాయకులు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.   


పొత్తులు ఉండవని సీనియర్లకు క్లారిటీ ఇచ్చేసిన రాహుల్ 
 
భారత రాష్ట్ర సమితితో పొత్తులు అనే మాట ఉండదని రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణ నేతలకు స్పష్టం చేశారు. ఈ విషయంలో మరింక ఏ చర్చలకు ఆస్కారం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆగింది. అక్కడ్నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు కొంత సమయం ఉండటంతో పార్టీ సీనియర్లు ఆయనను ఎయిర్‌పోర్టులో కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పార్టీ నేతలకు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలో మారనున్న రాజకీయ పరిణామాలతో  బీఆర్ఎస్...కాంగ్రెస్ వైపు నిలుస్తుందని.. ఆ రెండు  పార్టీలు కలసి పోటీ చేయవచ్చునని కొంత మంది కాంగ్రెస్ సీనియర్లు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాంటి చాన్సే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పేశారు. ఇక సీనియర్ల ఆశ..  దళిత సీఎం నినాదమే.