Rajiv Gandhi Civils Abhayahastham Scheme Guidelines: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 'రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం' (Rajivgandhi Civils Abhayahastham) పథకం కింద ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనుంది. సింగరేణి సంస్థ ద్వారా ఈ సాయాన్ని ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం ప్రజాభవన్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరామ్ పాల్గొన్నారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున సాయం చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. సివిల్స్ సాధించి మన రాష్ట్రానికే రావాలని.. ఐఏఎస్, ఐపీఎస్‌లు మన వారైతే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి సివిల్స్ 2024లో విజయం సాధించిన అభ్యర్థులకు జ్ఞాపికను అందజేశారు.
పథకానికి అర్హతలివే..
- అభ్యర్థులు తెలంగాణకు చెందిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ (ఈడబ్ల్యూఎస్ కోటా) సామాజిక వర్గాలకు చెందిన వారై ఉండాలి.
- యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు. గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదు. ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఒకే ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక సాయం పొందే వీలుంటుంది.
కాగా, దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మంది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు రాస్తున్నట్లు అంచనా. తెలంగాణ నుంచి దాదాపు 50 వేల మంది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తుండగా.. దాదాపు 400 నుంచి 500 మంది వరకూ ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తున్నట్లు అంచనా. వీరికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందనుంది.
జాబ్ క్యాలెండర్‌పై..
ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని.. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని.. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు వివరించారు. పరీక్షలు మాటిమాటికీ వాయిదా పడడం మంచిది కాదని.. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ - 2 పరీక్ష వాయిదా వేసినట్లు చెప్పారు. గ్రూప్ 1, 2, 3, పోలీస్, డీఎస్సీ, టెట్ ఇలా పరీక్ష ఏదైనా సరైన సమయంలో సమర్థంగా నిర్వహించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.