Telangana Governor likely to write letter to state Government | హైదరాబాద్: తెలంగాణలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి జరుగుతోందని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం అని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎగ్జామ్స్ 4 నెలలు వాయిదా వేశారంటే, 4 వందల కోట్లు వస్తాయా ? అందులో సీఎం రేవంత్ వాటా ఎంత ? అని కేటీఆర్ ప్రశ్నించారు.


రాష్ట్రంలో భయానక వాతావరణం 
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, కాంగ్రెస్ మోసపూరిత హామీలు, ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్సీలు కొందరితో వెళ్లి గవర్నర్‌ను కలిశాం. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, గ్రూప్స్ అభ్యర్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కి, మోసం చేస్తుందో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. హామీలు అమలు చేయాలని నిరసన తెలిపిన విద్యార్థుల నిర్భంధం, అణిచివేత, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులతో రాష్ట్రంలో భయానక వాతావరణం కల్పించారని ఫిర్యాదు చేశాం. 


చిక్కడపల్లి సిటి సెంట్రల్ లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తూ ఉద్యమం నాటి అణిచివేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అవలంభిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పన, జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించి ఇచ్చిన ప్రకటనలు, హామీలను గవర్నర్ కు తెలియజేశాం. తెలంగాణలో గ్రూప్ 1, 2, 3 పోస్టులు పెంచుతామన్న హామీలు పట్టించుకోవడం లేదు.  


గవర్నర్ సీరియస్, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ !
రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని గవర్నర్ కు తెలిపాం. విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీఛార్జ్ లు, అక్రమ అరెస్టులపై సైతం గవర్నర్ సీరియస్ అయ్యారని కేటీఆర్ తెలిపారు. హోం శాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని గవర్నర్ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నెగ్గిన దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసినట్లు, స్పీకర్ గారికి కూడా ఫిర్యాదు చేశామని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లవద్దని గవర్నర్ అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని లేఖ రాస్తా అని చెప్పారని కేటీఆర్ తెలిపారు. 


రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు రాహుల్ గాంధీ పోజులు కొడుతూ, మరోవైపు వేరే పార్టీ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను గవర్నర్ తో పాటు, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. తన పరిధిలో ఏ అంశంలో అయినా న్యాయం చేస్తామని గవర్నర్ అన్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. 


కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగ పాలు అయ్యిందని, ఇక మేడిగడ్డ కొట్టుకు పోయిందని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి కావడంతో వరద లాగ నీళ్లు వస్తున్న మేడిగడ్డ తట్టుకోవటమంటే అదే కాళేశ్వరం గొప్పతనం అన్నారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. 


Also Read: తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం - వారికి రూ.లక్ష ఆర్థిక సాయం