NEET UG Results 2024 Declared: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET UG ఫలితాలను విడుదల చేసింది. సెంటర్ల వారీగా ఈ ఫలితాలు వెల్లడించింది. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు exams.nta.ac.in/NEET వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. లేదా neet.ntaonline.in. సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే సుప్రీంకోర్టులో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విచారణ జరుగుతోంది. ఈ నెల 22న మరోసారి విచారణ జరగాల్సి ఉంది. ఈ లోగా NTA నీట్ యూజీ ఫలితాలు వెల్లడించడం కీలకంగా మారింది. నిజానికి జులై 20 మధ్యాహ్నం లోగా యూజీ ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు NTA వెబ్‌సైట్‌లో సెంటర్ల వారీగా రిజల్ట్స్‌ని అప్‌లోడ్ చేసింది. విద్యార్థుల ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఫలితాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు NTA ఫలితాలను అప్‌లోడ్ చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ జేబీ పర్దివాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. నీట్ యూజీ రీఎగ్జామినేషన్‌పైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని అనిపించినప్పుడే ఈ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇప్పటికే నీట్ పేపర్ లీక్ కేసులో CBI విచారణ కొనసాగుతోంది. నలుగురు విద్యార్థులను అరెస్ట్ చేసింది. పేపర్ లీక్‌లో వీళ్ల హస్తం ఉందని తేలితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తేల్చి చెప్పారు. ఈ ఏడాది మే 5వ తేదీన NEET UG ఎగ్జామ్ జరిగింది. దేశవ్యాప్తంగా 571 సిటీల్లో 4,750 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. అయితే..జూన్ 4వ తేదీనే ఫలితాలు విడుదలయ్యాయి. అప్పుడే అవకతవకలు బయటపడ్డాయి. ఫలితాల్లో ఏదో మతలబు జరిగిందని అభ్యర్థులు ఆందోళన చేశారు. అప్పుడే పేపర్ లీక్ వ్యవహారం బయటకు వచ్చింది. ఆ తరవాత జూన్ 23న బాధిత విద్యార్థులకు మళ్లీ ఎగ్జామ్ పెట్టారు. జూన్ 30న ఫలితాలు విడుదల చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫలితాలు విడుదలయ్యాయి. 24 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయగా అందులో 1,563 మందికి రీఎగ్జామ్ పెట్టారు. దాదాపు నెల రోజులుగా నీట్‌పై వివాదం కొనసాగుతోంది. క్వశ్చన్ పేపర్ లీక్ అవడంపై అభ్యర్థులు ఆందోళనలు నిర్వహించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే అని, కానీ అది ఎలా జరిగిందో విచారణ జరపాలని తేల్చి చెప్పింది.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు..
1. NTA NEET UG వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. అక్కడ NEET city అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరవాత సెంటర్ వైజ్ రిజల్ట్స్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
3. ఆ తరవాత మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ స్టేట్, సెంటర్‌ని ఎంచుకోవాలి.
4. ఆ స్క్రీన్‌పై ఫలితాలు చూసుకోవచ్చు.