Gangula Kamalakar is unable to decide on his political career : మాజీ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేత గంగుల కమలాకర్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. తన మార్క్ పాలిటిక్స్ తో హల్ చల్ చేసే ఆ సీనియర్ లీడర్ గప్‌చుప్‌గా ఉంటున్నారు. కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన పార్టీ మారే ఆలోచనలో కఠినమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న పాత పరిచయాలు కాంగ్రెస్ వైపు లాగుతున్నాయి. ఇలా గందరగోళంగా ఉండటంతో ఆయన సైలెంట్‌గా ఉంటున్నారు.
బీసీ వర్గాల్లో పట్టున్న గంగుల కమలాకర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి జిల్లాలో బలమైన బీసీ నేత గంగుల కేసీఆర్ , కేటీఆర్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గంగుల ఆ ఇద్దరికి నమ్మిన బంటుగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ఏ పని అప్పగించిన దాన్ని విజయవంతం చేయడానికి కష్టపడి పని చేస్తారని చెబుతుంటారు. గంగుల ప్రస్తుతం పార్టీ అధినాయకత్వానికి అంటి ముట్టనట్టు గా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో పార్టీతో పెద్దగా సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్యే పార్టీ వీడినా విమర్శలకు దూరం
ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ వీడినా స్పందించకుండా సైలెంట్ గానే ఉన్నారు గంగుల. మిగతా నేతలంతా విమర్శలు గుప్పించారు. హాట్ హాట్ కామెంట్లు చేసే గంగుల ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. వాస్తవానికి గంగుల పార్టీ మారుతారని చాలా రోజుల క్రితమే ఊహాగానాలు మొదలయ్యాయి. నెక్స్ట్ గంగులే అంటూ దాదాపు నెల రోజులుగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. ఈ ప్రచారాలను ఆయన ఖండించలేదు. కొద్ది రోజుల కిందట అధినేత కేసీఆర్ ను కలిసిన గంగుల ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆయన పేరు అలా ప్రచారంలో ఉండగానే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ లో చేరుతున్నారు.
ప్రభుత్వంపై విమర్శలకు దూరం
టిఆర్ఎస్ ముఖ్య నాయకులు అంతా ప్రభుత్వంపై ఏదో రూపంలో పోరాడుతుంటే గంగుల మాత్రం నోరు తెరవడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో గంగులకు ఉన్న పరిచయాలే కారణమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి గంగుల టిడిపిలో టీడీపీ లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారాలు ఉన్నాయి. అయితే ఆయన కాంగ్రెస్ లో కూడా చేరలేకపోతున్నారు. పొన్నం ప్రభాకర్ తో ఆయనకు సరైన సంబంధాలు లేకపోవడంతో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు.