YSR Village Health Clinics Notification : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో 1,681 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలేజ్ క్లినిక్ లలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి వైద్యశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. వైద్యశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో పాటు గ్రామాల్లో హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తుందని అధికారులు అంటున్నారు. గ్రామాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటుచేస్తున్నారు. ఈ క్లినిక్ లలో సేవలు అందించడానికి భారీగా హెల్త్ ప్రొవైడర్ ను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దరఖాస్తు ఇలా
వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలో ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ చేశారు. మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ తాజాగా వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు ఆగస్టు 9 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు. hmfw.ap.gov.in లేదా cfw.ap.nic.in వెబ్ సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఈ పోస్టులకు హాల్ టికెట్లు జారీచేయనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ తేదీని హాల్ టికెట్లలో తెలియజేస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా హెల్త్ ప్రొవైడర్ లను ఎంపిక చేయనున్నారు.
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ కోర్సుతో బీఎస్సీ పూర్తి చేయాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 10 ఏళ్లు మినహాయింపు ఇచ్చింది. బీఎస్సీ నర్సింగ్ సిలబస్ ప్రశ్నలు ఇస్తారు. 200 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుందని నోటిఫికేషన్ లో తెలిపారు. మూడు గంటల పాటు పరీక్షను నిర్వహించనున్నారు.
Also Read : ITBP Constable Notification: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
Also Read : Steel Plant Jobs: విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ఉద్యోగాలు, వివరాలు ఇలా!