కోవిడ్ కారణంగా విద్యా వ్యవస్థలో ఎన్నడూ ఊహించని మార్పులు వచ్చాయి. సాంప్రదాయ విద్యపై ఉన్న అభిప్రాయాలన్నీ మహమ్మారి కారణంగా మారిపోయాయి. ఎక్కడి నుంచి అయినా చదువుకోవడం సాధ్యమనే విషయాన్ని గుర్తు చేశాయి. విద్యా సంస్థలు సైతం కొత్త విధానాల్లో చదువు చెప్పాయి. మంచి కొలువు దక్కాలంటే.. కేవలం చదువు ఒక్కటే ఉంటే సరిపోదు. ప్రాక్టికల్ నైపుణ్యాలు చాలా అవసరం. మనం ఎంత చదువుకున్నా.. నైపుణ్యాలు లేకుంటే జాబ్ రావడం కష్టం. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం ఎంచుకున్న రంగాన్ని బట్టి ఉద్యోగానికి అవసరమైన కోర్సులను ఎంచుకోవాలి. ఆ కోర్సులను కూడా నేర్చుకోవడం ద్వారా చదువు పూర్తయ్యే సరికి ఉద్యోగం మన చేతిలో ఉంటుంది. 


ప్రపంచమంతా డిజిటల్ యుగం వైపు పరుగులు పెడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాదిన్నర కాలంలో టెక్నాలజీ యుగంలో చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్న కొద్దీ మనం కొత్త కోర్సులను నేర్చుకోవాలి. ఏదైనా కోర్సులో చేరే ముందు దాని గురించిన కనీస సమాచారం మనకు తెలిసి ఉండాలి. ఫలానా కోర్సు ఎంచుకోవడం వల్ల.. మనం చదువుతోన్న డిగ్రీకి ఉపయోగం ఉంటుందా? ఈ కోర్సులకు మార్కెట్లో బూమ్ ఉందా? దీని వల్ల ఉద్యోగాలు వస్తాయా? అని పలు కోణాల్లో అధ్యయనం చేయాలి. చివరికి మనకు తగ్గ కోర్సును ఎంచుకోవాలి. ఇంటర్ పూర్తయిన తర్వాత మనం ఎంచుకునే కోర్సును బట్టి మన కెరీర్ డిసైడ్ అవుతుంది. మరి ఈ 2021 డిజిటల్ యుగంలో మంచి బూమ్ ఉన్న 5 కోర్సులేంటో చూద్దామా?  



  • సైబర్ సెక్యూరిటీ.. 
    సైబర్ సెక్యూరిటీ.. విద్యార్థులకు అత్యంత డిమాండ్ ఉన్న కెరీర్‌లలో ఒకటి. భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యులు మొదలు.. ప్రభుత్వాలు, వివిధ సంస్థలు సైతం హ్యాకర్ల బారిన పడి, సైబర్ బెదిరింపులను ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయి. సైబర్ నిపుణులు మాత్రమే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టగలుగుతారు. 2024 నాటికి దేశంలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల డిమాండ్ 200 శాతం పెరిగే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. 



ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) బ్యాగ్రౌండ్ ఉన్న వారు ఈ కోర్సు నేర్చుకోవచ్చు. బీటెక్/ బీఈ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఇంజనీరింగ్), బీటెక్ (సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్), బీఎస్సీ (ఫోరెన్సిక్ సైన్స్), డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన వారికి సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగాలు దక్కుతాయి. 



  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ 



భారతదేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఆటోమొబైల్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్ట్ మొదలైన రంగాలలో కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మహా సముద్రం లాంటిది. ఏఐలోనే డీప్ లెర్నింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి సబ్‌సెట్స్ ఉంటాయి. భవిష్యత్ అంతా ఏఐ రంగం మీదే నడుస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు నేర్చుకున్న వారికి జీతం కూడా భారీగానే ఉంటుంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ఇంజనీరింగ్, ఈసీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలను ఎంచుకున్న వారు అదనంగా ఏఐ కోర్సు నేర్చుకుంటే భవిష్యత్ బాగుంటుంది.



  • డేటా సైన్స్



బెస్ట్ కెరీర్ ఆప్షన్లలో డేటా సైన్స్ ఒకటి. డేటా మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రస్తుతం ప్రతి పరిశ్రమ.. డేటా అనలిటిక్స్ నిపుణుల కోసం అన్వేషిస్తోంది. డేటా అనలిటిక్స్ ద్వారా రీసెర్చ్ చేయడంపై మక్కువ ఉన్న వారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. డేటా సైన్స్ పరిధి విస్తృతంగా ఉంటుంది. ఇండియాలో ప్రస్తుతం డేటా సైన్స్ మీద జాబ్ ఓపెనింగ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. బీఎస్సీ డేటా సైన్స్, బీటెక్ బిగ్ డేటా అనలటిక్స్, బీసీఏ డేటా సైన్స్, ఐబీఎం డేటా సైన్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, అప్లయిడ్ డేటా సైన్స్ విత్ పైతాన్ సర్టిఫికేట్స్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి డేటా సైన్స్ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయి. 



  • నర్సింగ్ 



నర్సింగ్ కూడా అత్యంత లాభదాయకమైన కెరీర్ ఆప్షన్లలో ఒకటి. విద్యార్థులు వారి ఎకడమిక్ బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేకుండా ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. కోవిడ్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల నర్సింగ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఈ కోర్సు చేసిన వారికి వైద్య రంగంలో ఉద్యోగాలు దక్కుతాయి. భారతీయ వైద్య వ్యవస్థలో నర్సుల పాత్ర కీలకం. నర్సింగ్ చేసిన వారికి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. బీఎస్సీ నర్సింగ్, ఏఎన్ఎమ్, జీఎన్ఎమ్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా నర్సింగ్ రంగంలో కొలువులు దక్కుతాయి.  



  • ఫార్మాస్యూటికల్స్ సైన్స్ 



గత కొన్నేళ్లుగా భారతదేశంలో రెండంకెల వృద్ధి రేటు (CAGR) చూపించిన రంగాలలో ఫార్మాస్యూటికల్ ఒకటి. గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలో ఇండియా తన ఉనికిని వేగంగా పెంచుకుంటోంది. ప్రస్తుత మహమ్మారి కాలంలో ఔషధాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి ఔషధ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ రంగం మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్ పూర్తి చేశాక.. బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ (లేటరల్ ఎంట్రీ), బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ (ఆయుర్వేద), డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులను ఎంచుకోవచ్చు. వీటి ద్వారా ఫార్మాస్యూటికల్ రంగంలో జాబ్స్ వస్తాయి. 


Also Read: Education Apps: పిల్లలకు 'స్మార్ట్'గా చదువు నేర్పే యాప్‌లు..


ALso Read: Telugu Bhojanam: పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఇవే...