New Policy Priorities: 


క్లస్టర్ల వారీగా అభివృద్ధి అవసరం..


ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకున్న సందర్భంగా...భారత్ ఇప్పుడు సుదీర్ఘ లక్ష్యాలను పెట్టుకోవాల్సిన అవసరముంది. 75 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. మరో పాతికేళ్లలో ఇంకెంతో మారాల్సి ఉంది. అంటే..100వ స్వాతంత్య్ర దినోత్సవం  జరుపుకునే నాటికి...భారత్ టాప్‌గా నిలవాలి. ఇందుకోసం ఏం చేయాలి..? ఈ ప్రశ్నకు ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. సెక్టార్‌లు, ప్రాంతాల వారీగా కొత్త ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నది వాళ్లు చేస్తున్న ప్రధాన సూచన. అంటే...ప్రాంతాల వారీగా విధానాల్లో మార్పులు చేయాలి. ఆయా క్లస్టర్‌లకు ఎలాంటి వసతులు అవసరం, ఎలాంటి పాలసీలు అమలు చేస్తే వృద్ధి రేటు పరుగులు పెడుతుంది అన్న అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకోసం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి. తక్కువ నైపుణ్యాలున్న కార్మికులు, మహిళలపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆదాయం బాగా వస్తుంది అనుకున్న విభాగాలను గుర్తించి అక్కడ మానవ వనరులను పెంచటమూ కీలకమే. అత్యధిక ఉత్పాదకతను సాధించేందుకు అవకాశమున్న అన్ని చోట్లా పెట్టుబడులు పెట్టి...ఉద్యోగావకాశాలనూ పెంచాలి. ఉద్యోగాల కోసం ఏళ్ల పాటు వెతుక్కునే పరిస్థితులు పోయి...వారినే ఉద్యోగాలు వెతుక్కుని వచ్చే స్పేస్‌ను క్రియేట్ చేయాలని చాలా స్పష్టంగా చెబుతున్నారు నిపుణులు. 
ఏ రంగాల్లో అయితే మానవ వనరులు ఎక్కువ అవసరం అవుతాయో గమనించి...అందుకు తగ్గట్టుగా ఆ రంగంలో సంస్కరణలు చేపట్టాలి. 


విద్య, వైద్యం చాలా ముఖ్యం..


బాల్యంలోనే పేదరికం అనుభవించడం, మెరుగైన ఆరోగ్య సేవలు లేక ఇబ్బందులు పడటం లాంటి సమస్యలు ఎదుర్కొన్న వారికి...దీర్ఘకాలం పాటు ఆ ప్రభావం పడుతుంది. చదువుల్లోనూ వెనకబడిపోతారు. ఈ కారణంగానే...మార్కెట్‌లో డిమాండ్ లేక ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితమూ ఉండదు. అందుకే...బాల్యంలోనే వారికి సరైన విద్య, వైద్యం అందించేలా చర్యలు చేపడితే...అది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థనే పరుగులు పెట్టిస్తుంది. మార్కెట్‌లోని కాంపిటీషన్‌ను ఇంకా బలోపేతం చేయడమూ కీలకమే. చాలా విభాగాల్లోని మార్కెట్‌ స్ట్రక్చర్‌లు సరిగా లేకపోవటమే సమస్యలు తెచ్చి పెడుతోంది. ఇదే భారత్‌ను వెనక్కి నెడుతోంది. డిజిటల్ మార్కెట్‌కు 
అనుగుణంగా మార్పులు చేస్తూనే...కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసమరైన వాతావరణం సృష్టించాలి. విలువ ఆధారిత పోటీతత్వాన్ని పెంచి, ఆయా కంపెనీల ఉత్పాదకతను భారీగా పెంచాలి. ఇందుకోసం..ప్రభుత్వాలు.. ఇన్‌సెంటివ్స్‌ ఇవ్వాలి. తద్వారా సప్లై అండ్ డిమాండ్‌ సైకిల్‌లో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ప్రయాణం సాగిపోతుంది.


కొత్తగా వస్తున్న పరిశ్రమలు ఈ పోటీని తట్టుకుని నిలబడటానికి కాస్త సమయం పడుతుంది. అందుకే..ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌పై దృష్టి సారించి ఆయా కంపెనీలకు ప్రభుత్వాలు అండగా నిలవాలి. పెట్టుబడులు భారీగా తరలి వస్తాయన్న భరోసా కల్పించాలి. స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌తోనూ అనుసంధానమవ్వాలి. ఎదిగేందుకు కొత్త అవకాశాలు చూపించాలి. అనవసరపు వ్యయాలు తగ్గించుకునేందుకు...డిజిటలైజేష్ వైపు మళ్లాలి. మార్కెట్‌ నుంచి ఐసోలేట్ అవకుండా నిత్యం పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. ఈ అన్ని అంశాలపైనా దృష్టి సారిస్తే...పారిశ్రామిక రంగంలో చాలా వరకు మార్పులు వస్తాయి. నిరుద్యోగ రేటూ తగ్గిపోతుంది. 


Also Read: India's Growth: ఇండియా అధికాదాయ దేశంగా మారటం ఎలా? ఆ సమస్యలు పరిష్కారమవుతాయా?


Also Read: India's Competitiveness: ఇండియాలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతోందా? ఈ సవాలు ఎలా దాటాలి?