ఎర్రటి ఎండలో అయినా బయటికి వెళ్లేందుకు ఇష్టపడతారు, కానీ ఎముకలు కొరికే చలిలో మాత్రం బయట తిరిగేందుకు ఎవరూ ఇష్టపడరు. ఎండను కాసేపు తట్టుకోగలం కానీ, చలిని తట్టుకోవడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చలిలో కొన్ని నిమిషాలు ఉంటే చాలు, ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్య ఒళ్ళు నొప్పులు. అవి ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు చాలా మందికి. కాళ్లు, చేతులు, కీళ్లు నొప్పి పెడుతూ ఉంటాయి. శీతాకాలంలో ఇలా శరీర నొప్పులు రావడం సాధారణమే.


ఎందుకు వస్తాయి?
చల్లని వాతావరణం శరీరంపై చాలా ప్రభావం చూపిస్తుంది. కండరాలు, కీళ్లు ఒత్తిడికి గురవుతాయి.  బిగుసుకున్నట్టు అవుతాయి. దీనివల్ల నొప్పి పెడతాయి. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరంలో రక్తనాళాలు సంకోచిస్తాయి. వేడిని బయటికి పోకుండా కాపాడుకోవడం కోసమే ఇలా సంకోచిస్తాయి. దీనివల్ల రక్తప్రవాహం తగ్గుతుంది. అందుకే శరీరం నొప్పులు పెడుతుంది. అలాగే శీతాకాలంలో సూర్యకాంతి చాలా తక్కువగా పడుతుంది. దాదాపు కొందరికి అసలు ఆ కాంతి సోకడం లేదనే చెప్పొచ్చు. ఇలా సూర్యకాంతి తక్కువగా సోకడం వల్ల విటమిన్ డి తక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా ఒళ్ళు నొప్పులకి కారణం అని చెప్పాలి. అలాగే చలికాలంలో హార్మోన్లలో మార్పులు కూడా అధికంగా ఉంటాయి. శరీరం అలసిపోయి నీరసంగా మారిపోతుంది. అందుకే అకారణంగా ఒళ్ళు నొప్పులు అనిపిస్తాయి. అలాగే చలికాలంలో ఏ పని చేయడానికి శరీరం ఇష్టపడదు. బద్దకంగా అనిపిస్తుంది. ఒకే చోట కూర్చొని లేదా పడుకొని ఉండడానికే ఇష్టపడతారు. దీని వల్ల ఎలాంటి శారీరక శ్రమ ఉండదు. ఇది కూడా ఒళ్ళు నొప్పుల ప్రభావాన్ని పెంచుతాయి


ఎలా తప్పించుకోవాలి?
చలికాలంలో శరీరం నొప్పులు పెట్టకుండా ఉండాలంటే ముందు మీరు చురుగ్గా ఉండాలి. ఒకే చోట కదలకుండా ఉండడం అనేది శరీరానికి అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. ఉన్ని దుస్తులు వేసుకుని వ్యాయామం, నడక, యోగా వంటివి రోజూ కనీసం గంట పాటు చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటివి ఏవీ రావు. అలాగే నీళ్లు కూడా చాలా మంది తక్కువ తాగుతారు. శీతాకాలంలో నీళ్లు తాగడం కూడా ముఖ్యమే. లేకుంటే బాడీ మీకు తెలియకుండానే డిహైడ్రేషన్ బారిన పడుతుంది. విటమిన్ డి తగ్గడం వల్ల ఇతర సమస్యలు మొదలవుతాయి. కాబట్టి డాక్టర్ల సూచన మేరకు విటమిన్ డి సప్లిమెంట్లు చలికాలంలో తీసుకోవడం ఉత్తమం. అలాగే కొద్ది మొత్తంలో విటమిన్ డి లభించే గుడ్లు, కొవ్వు పట్టిన చేపలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కండరాలు, ఎముకలు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. 


Also read: పారానాయిడ్ పర్సనాలిటి డిజార్డర్ - ఇదొక అనుమానపు జబ్బు, చికిత్స కూడా ఉంది



































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.