భార్య తన భర్తను నిరంతరం అనుమానించడం లేక భర్త తన భార్యపై అనుమానాలు పెంచుకోవడం సమాజంలో చూస్తూనే ఉంటాం. వారిని అనుసరించడం, వాళ్ళ మొబైల్ ఫోన్లు, మెయిల్స్ చెక్ చేయడం... ఇలాంటి పనులు చేస్తూ జీవిత భాగస్వామిని అవమానిస్తూ ఉంటారు. వీటిని అతి జాగ్రత్తలుగా చెప్పుకుంటారు. నిజానికి అది జాగ్రత్త కాదు, అనుమానపు జబ్బు. ఎదుటివారు ఎంత మంచిగా ఉన్నా కూడా వారు ఏదో తప్పు చేస్తున్నారని, తనను మోసం చేస్తున్నారన్న భావనతో ఉంటారు ఈ రోగం ఉన్నవారు. దీన్ని పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్జర్ అంటారు. ఈ జబ్బుతో బాధపడే అనుమాన పక్షులు సమాజంలో ఎంతో మంది ఉంటారు. కానీ అది మానసిక రుగ్మత అని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ. ఈ జబ్బుకు చికిత్స ఉందని ఎంతోమందికి తెలియదు.
ఈ పారానాయిడ్ పర్సనాలిటీ డిసార్డర్‌ను షార్ట్ కట్లో PPD అని పిలుస్తారు మానసిక వైద్యులు. డిప్రెషన్ వంటివి కూడా మానసిక రుగ్మతలే కానీ PPD మాత్రం ఒక వ్యక్తిత్వ రుగ్మత. అనుమానించడం ఆ జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి జీవితంలో ఒక భాగం. అతని వ్యక్తిత్వంలో ఒక భాగం. అతని మనస్తత్వంలో ఒక భాగం. అందుకే దీన్ని ఒక జబ్బుగా కూడా ఆ వ్యక్తి గుర్తించలేడు. తన అనుమానాలే నిజమని 100% నమ్ముతాడు. అలాంటి వ్యక్తికి కచ్చితంగా చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ అనుమానాల వల్లే ఎన్నో కుటుంబాలు కూలిపోయిన సందర్భాలు అధికం.
ఎందుకు వస్తుంది?
ఈ అనుమానపు జబ్బు ఎందుకు వస్తుంది? అనేది ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. అది వారసత్వంగా జన్యువుల ద్వారా వచ్చే అవకాశం ఉందని, అలాగే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు వైద్యులు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన పిల్లలు, చిన్నప్పటి నుంచి అవమానాలకు, అనుమానాలకు, శారీరక, లైంగిక వేదనకు గురైన పిల్లలు, భావోద్వేగాలు అధికంగా ఉండే పిల్లలు, చాలా సెన్సిటివ్‌గా పెరిగిన పిల్లలు... పెద్దయ్యాక ఈ అనుమానపు జబ్బుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే?
తన చుట్టు ఉన్నవారు ఎంత బాగా చూస్తున్నా కూడా, వారంతా తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుంటారు ఈ రుగ్మతతో బాధపడుతున్న రోగులు. తల్లిని, తండ్రిని కూడా అనుమానిస్తారు. ఎవరిని నమ్మరు. స్నేహితులు, భార్యా, భర్తా... ఇలా ప్రతి వారిని అనుమానం గానే చూస్తారు. ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా తన భార్య లేదా భర్త తనకు ద్రోహం చేస్తున్నారని నిత్యం వేధిస్తుంటారు. తన అనుమానాలే సరైనవని చెప్పుకోవడానికి ఆధారాలు వెతికే పనిలో కూడా పడతారు. ఇలాంటి వాళ్లు ఎవరితోనూ ఏ బంధుత్వాన్ని నిలబెట్టుకోలేరు. చిన్న చిన్న విషయాలకే ఎదుటివారిపై తీవ్రంగా ఎగిరి పడతారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటారు. సరిగ్గా విశ్రాంతి తీసుకోలేరు. నిత్యం మానసిక ఒత్తిడితో ఉంటారు.
చికిత్స ఉందా?
ఈ మానసిక వ్యక్తిత్వ రుగ్మతకు చికిత్స ఉంది. కానీ దాన్ని తీసుకోవడానికి ఈ రోగం ఉన్నవారు ఎవరూ ముందుకు రారు. తమకు ఏ సమస్య లేదని, కావాలనే తనని ఏదో చేయడానికి చికిత్స పేరుతో తీసుకెళ్తున్నారని అనుమానిస్తారు. వారిని చికిత్సకు ఒప్పించడం చాలా కష్టం. కుటుంబ సభ్యులే ఏదో రకంగా ఒప్పించి చికిత్స ఇప్పించాలి. వీరికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరిపీ వంటి వాటి ద్వారా చికిత్స మొదలవుతుంది. సైకోథెరపీ కూడా చేస్తారు.ఈ సమస్యకు చాలా దీర్ఘకాలికంగా చికిత్స చేయడం అవసరం. ఆ ఓపిక కుటుంబ సభ్యులకు ఉండాలి. అంతేకాదు ఈ అనుమానపు జబ్బు ఉన్నవాళ్లు, తనకు చికిత్స అందిస్తున్న వైద్యులు, థెరపిస్టులను కూడా అనుమానిస్తారు.
Also read: అనవసర భయాలతో రొయ్యలు తినడం మానేస్తున్నారా? అయితే మీకే నష్టం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.