నేడు (జనవరి 24) రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ నారాయ‌ణ‌పేట జిల్లాలో ప‌ర్యటించ‌నున్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు మ‌హ‌ముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట నుంచి నారాయ‌ణ‌పేట జిల్లాకు బ‌య‌ల్దేర‌నున్నారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు ఇంటిగ్రెటేడ్ క‌లెక్టర్ కార్యాల‌యానికి మంత్రులు మ‌హ‌ముద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డితో క‌లిసి కేటీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు.


ఉద‌యం 11:45 గంట‌ల‌కు ఇంటిగ్రెటేడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రారంభించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు స‌ఖి సెంట‌ర్‌ను, 12:45కు సినీయ‌ర్ సిటిజెన్ పార్కును ప్రారంభించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో లంచ్ చేయ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నారాయ‌ణ‌పేట స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించే బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించ‌నున్నారు. సాయంత్రం 4:30 గంట‌ల‌కు కేటీఆర్ హైద‌రాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.


నేడు జనసేనాని ప్రచార రథం వారాహికి కొండ గట్టులో ప్రత్యేక పూజలు, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే
జనసేనాని ప్రచార రథం వారాహి నేడు రోడ్డెక్కనుంది. కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజల అనంతరం తన మొదటి పరుగు ప్రారంభించనుంది. తన ఆరాధ్య దైవం ఆంజనేయస్వామికి పూజలు చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సార్వత్రిక సమరాన్ని ప్రారంభించనున్నారు. నేడు ఉదయం వారాహి పూజ.. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి పూజలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ నేతలతో సమర సన్నాహాలపై చర్చించనున్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన నేపథ్యంలో ఈ సారి అభ్యర్ధుల్ని బరిలోకి దించే దిశగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.


పవన్ కల్యాణ్ వారాహి వాహనంతోపాటు నేడు హైదరాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరుతారు. అక్కడ ఉదయం 11 గంటలకు పవన్ కల్యాణ్ చేరుకుని వారాహికి ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. అక్కడనుండి మధ్యాహ్నం 1 గంటలకు నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్‌లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు.


అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లిలో ముఖ్యనేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. పవన్ ముందుగా అనుకున్న అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాత్ర అనంతరం పవన్ కల్యాణ్ తిరిగి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతారు.


నేటి నుంచి బీఎస్సీ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
బీఎస్సీ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో నేటి నుంచి 26 వరకు మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం  ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో యూనివర్సిటీ పరిధిలోని మొదటి విడత కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఉదయం 8 గంటల నుంచి 26న సాయంత్రం 4 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్దులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, మెరిట్‌ జాబితా అదేవిధంగా కళాశాల వారీగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లొ చూసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు.


నేడు జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొడకండ్లలో కుట్టు మిషన్ శిక్షణా తరగతుల కార్యక్రమం ప్రారంభోత్సవం అనంతరం, 11.30 గంటలకు చెన్నూరులో కుట్టు మిషన్ల శిక్షణా తరగతుల సందర్శన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తిలో కుట్టు మిషన్ల శిక్షణా తరగతుల సందర్శన, మధ్యాహ్నం 12.30 గంటలకు గూడూరులో కుట్టు మిషన్ల శిక్షణా తరగతుల సందర్శన లో పాల్గొంటారు.