Hyderabad Crime News: హైదరాబాద పాతబస్తీలో శివార్లలో శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లలో అమ్మాయిలు, ట్రాన్స్ జెండర్లతో ముజ్రాలు చేయడం సర్వసాధారణమనే విషయమే చెప్పాలి. కానీ ఓ రౌడీ షీటర్ పలువురు యువకులను బెదిరించి.. వారి బట్టలన్నీ చింపేసి కేవలం అండర్ వేర్ ల మీద మాత్రమే వారితో నృత్యాలు చేయిస్తున్నాడు. కత్తులతో బెదిరిస్తూ వారితో అలా చేయిస్తున్నాడు. అంతే కాదండోయ్ వారు డ్యాన్స్ చేస్తుంటే.. వారి ఒళ్లంతా తడమం, హత్తుకోవడం, చెంపలపై ముద్దు పెట్టడం వంటివి చేస్తూ రాక్షసానందం పొందుతుంటాడు. అయితే మర్ఫా(అరబిక్ బ్యాండ్) మ్యూజిక్ వద్ద మూడు నెలల క్రితం జరిగిన ఓ ముజ్రా వీడియోలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన పోలీసులు వెంటనే బాధితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరగానే బాధితుడిని పట్టుకొని అతడి నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. 


దాడులే కాదు హత్యాయత్నం కేసుల్లో కూడా అలీ నిందితుడే..!


అయితే బాధితుడి పేరు బార్కస్ సలాలా చాంద్రాయణ గుట్టకు చెందిన వాడని.. అతడిని కత్తితో బెదిరించి యువకుడితో నగ్నంగా నృత్యం చేయించిన రౌడీ పేరు అలీ-బా-ఈసా గా గుర్తించారు. ఈనెల 20వ తేదీన పార్కింగ్ విషయమై జరిగిన గొడవ నేపథ్యంలో నడిరోడ్డుపై ఈయన కత్తి పట్టుకొని వీరంగం సృష్టించాడు. బాలాపూర్ ఠాణాలో రౌడీషీటర్ గా నమోదై ఉన్న సులేమాన్ బామ్(40)పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు అలీపై అదేరోజు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తర్వాత రెండు రోజుల్లోనే ఈ వీడియో బయటకు వచ్చింది. ఇది చాలదన్నట్లు నిందితుడు మద్యం మత్తులోనే అరాచకాలకు పాల్పడుతుంటాడు. రౌడీషీటర్ అలీ-బా-ఈసా తరచూ గొడవలకు దిగుతూ పలువురిపై దాడులు కూడా చేస్తుంటాడు. 


పోలీసుల ముందే వ్యక్తిని కత్తితో పొడిచిన రౌడీ..


ఈనెల 20వ తేదీన అలీ సోదరుడు ఫాహద్-బా-ఈసా సలాలా రోడ్డులో జిమ్ లో వ్యాయామం చేసేందుకు వచ్చి ఓ దుకాణం ముందు ద్విచక్ర వాహనం ఆపాడు. దుకాణ యజమాని హసన్ వహలాన్ వృద్ధుడు. అయితే దుకాణం వద్దకు లోడుతో డీసీఎం వాహనం వస్తున్నందున.. ఫాహద్ ను ద్విచక్ర వాహనం అక్కడి నుంచి తీసి మరోచోట పెట్టాలని కోరాడు. దీంతో ఫాహద్ వృద్ధుడితో గొడవకు దిగాడు. ఇది గమనించిన సులేమాన్ బామ్ వృద్ధుడితో ఎందుకు గొడవ పడుతున్నావని వారించగా ఘర్షణ ప్రారంభం అయింది. ఫాహద్ సోదరుడు అలీ కత్తితో వచ్చి పోలీసుల ముందే సులేమాన్ బామ్ పై దాడి చేసి పరారయ్యాడు. అలీ తరచూ ముజ్రాయి చేస్తూ మద్యం సేవించి కత్తితో బెదిరిస్తూ యువకులను అర్ధ నగ్నంగా నృత్యాలు చేయిస్తాడని వైరల్ అయిన వీడియోలోని బాధితుడు వివరించాడు. హత్యాయత్నం కేసులోనూ నిందితుడిగా ఉన్న అలీ పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇలాంటి నిందితులు రోడ్లపై తిరుగుతుంటే ప్రజలు చాలా భయపడిపోతున్నారు. ఎప్పుడు, ఎవరిని ఏ చేస్తాడో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అతడిని జైల్లో ఉంటేనే బయటి ప్రజలకు మంచిదని చెబుతున్నారు.