మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ షాకిచ్చింది. వైఎస్సార్ సీపీ ఎంపీ అవిష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీస్ లో విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సోమవారం అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నివాస పరిసరాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయాల్లో అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. మంగళవారం నాడు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించడానికిగానూ నోటీసులు ఇచ్చారు. అవినాష్ రెడ్డి తండ్రి ఎప్పుడూ వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగానే ఉండేవారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరో సోదరుడు వైఎస్ ప్రతాప్ రెడ్డి 2021 ఆగస్టులో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉందని ఆయన కూతురు సునీత సైతం పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని విచారించేందుకు హైదరాబాద్ ఆఫీసుకు రావాలని నోటీసులలో పేర్కొంది సీబీఐ.


మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్ధు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టుకు కొన్ని నెలల కిందట బదిలీ చేసింది. గంగిరెడ్డి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు. మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.  బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరపాలని సూచించింది. కేసు ట్రయల్‌ను తెలంగాణకు బదిలీ చేసినందున బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది.


విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన  
నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడిన సందర్భంలో చార్జిషీటు దాఖలు కాలేదన్న కారణంతో కేసులోని మెరిట్స్‌ను పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు.  కేసులోని మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరోసారి విచారణ చేపట్టాలని సూచించింది. డిఫాల్డ్ బెయిల్ రద్దు కాదంటూ ఏపీ హైకోర్టు తీర్పునివ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. డిఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.  అయితే విచారణకు గంగిరెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని.. బెయిల్‌ రద్దు చేయాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 


నాలుగేళ్లుగా  సాగుతూనే ఉన్న వివేకా హత్య కేసు 
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 4 ఏళ్లుగా కొనసాగుతుంది. మొదట ఏపీ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. తర్వాత సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.  ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శెంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారాడు. దీనితో కేసులో మరికొంత మంది ప్రమేయం ఉందొ లేదో తెలుసుకోడానికి దర్యాప్తు చేస్తున్నారు.  


హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే విచారణ జరగనున్న వివేకా హత్య కేసు 
వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికే తెలంగాణకు బదిలీ అయింది. తండ్రి వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యాలంటూ ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో ఈ కేసు విచారణ సక్రమంగా జరిగే అవకాశం లేదని, గతంలో సాక్షులు, అప్రూవర్‌గా మారిన వారు కూడా అనుమానాస్పద రీతిలో మరణించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.  హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.  హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమార్తె ఈ కేసు విచారణ పట్ల బాగా అసంతృప్తితో ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లుగా  సుప్రీంకోర్టు ప్రకటించారు.