DA To Telangana Govt Employees: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేసింది తెలంగాణ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డీఏ మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2.73 శాతం డీఏ మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 8 విడతల్లో డీఏ బకాయిలు చెల్లించనుంది. 2021 జూలై ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు తాజా డీఏ అందనుంది. జనవరి పింఛన్ తో కలిపి ఫిబ్రవరి వేతనంలో డీఏ చెల్లించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబధించిన షెడ్యూల్ విడులైంది. ఈ నెల 27 నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఇటీవల అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. దరఖాస్తులు అందిన 15 రోజుల్లోనే అప్పీళ్లను పరిష్కరిస్తామని తెలిపారు.
నాలుగేళ్ల తరువాత తొలిసారి
టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుందని ఇటీవల తెలిపింది. తాజాగా అందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం అధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈనెల 28 నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బదిలీలు, పదోన్నతుల పూర్తి షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ముందు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపట్టనున్నారు. అనంతరం హెచ్‌ఎం ఖాళీలను స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ ఫర్ చేస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 2015 జులైలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. మరోసారి 2018లో టీచర్ల బదిలీలు చేశారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
ఈ బదిలీలకు విద్యాశాఖలో దాదాపు 90 వేల మంది టీచర్లు అర్హత సాధిస్తారు. గత నిబంధనల ప్రకారం ఒకచోట ఉపాధ్యాయుడు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. ఈ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుడు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయుడు 5 ఏళ్లు మించి ఒకే చోట పనిచేయకూడదు. ఈ గరిష్ట సర్వీసుని పరిగణలోకి తీసుకొని అధికారులు బదిలీలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులను కేటాయించింది ప్రభుత్వం. ఈ సమయంలో టీచర్లను కూడా ట్రాన్స్ ఫర్ చేసింది. సీనియారిటీ ప్రతిపాదికన ఆప్షన్లు ఇచ్చి ఈ ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ విధానంపై అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్థానికతకు ప్రాధాన్యం లేకుండా కొత్త జిల్లాల కేటాయింపులు జరగడంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత ప్రాంతాలకు దూరంగా వెళ్లారు.