విటమిన్ డి మన శరీరానికి అత్యవసరమైన పోషకం ఇది. సూర్యరశ్మి ద్వారానే ఎక్కువగా లభిస్తుంది. ఆహారం ద్వారా లభించేది తక్కువే. ఈ విటమిన్ లోపం రాకుండా ఉండాలంటే రోజూ ఉదయపు ఎండలో ఓ అరగంట పాటు ఉండాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. మన దేశంలో ఎంతమంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారో తెలుసుకునేందుకు టాటా ల్యాబ్స్ ఇటీవల సర్వే నిర్వహించింది. ఇందులో 76% మంది భారతీయ జనాభా విటమిన్ డి లోపంతో ఉన్నట్టు తేలింది. ఈ సర్వే మనదేశంలోని 27 నగరాల్లో నివసిస్తున్న రెండు లక్షల ఇరవై వేల మందిపై చేశారు. వారి ఆ డేటాను బట్టి ఎంతమంది ఈ లోపానికి గురయ్యారో అంచనా వేశారు. ఈ సర్వే ప్రకారం 79 శాతం మంది పురుషులు, 75% మహిళలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా పాతికేళ్ల కన్నా తక్కువ వయసున్న యువత ఎక్కువగా విటమిన్ డి లోపంతో ఉన్నట్టు కనిపెట్టారు. మన దేశంలో అత్యధికంగా సూరత్, వడోదర నగరాల్లో 88 శాతం మంది విటమిన్ డి లోపం అధికంగా ఉన్నట్లు సర్వే ద్వారా అర్థమవుతుంది. ఇక ఢిల్లీ ప్రాంతంలో అత్యల్పంగా 72 శాతం మంది ఈ లోపంతో ఉన్నారు.
విటమిన్ డి లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బోలుగా అవ్వడం, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, కండరాలు కుచించుకుపోవడం, జీవక్రియ సరిగా జరగకపోవడం వంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
విటమిన్ తీవ్రంగా లోపిస్తే కింద చెప్పిన రోగాలు వస్తాయి.
1.రికెట్స్
2.మధుమేహం
3.డిప్రెషన్
4.కీళ్లవాతం
5. ప్రోస్టేట్ క్యాన్సర్
సులువుగానే...
విటమిన్ డి లోపంతో బాధపడే వాళ్ళు తమ ఆహారం, జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. పుట్టగొడుగులు, కొవ్వు ఉన్న చేపలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు అధికంగా తినాలి. ఉదయం ఎండలో అరగంటసేపు, సాయంత్రం మూడు తర్వాత వచ్చే ఎండలో అరగంటసేపు ఉండడం వల్ల సూర్యరశ్మి ద్వారా తగినంత విటమిన్ డి లభిస్తుంది. అలాగే విటమిన్ డి సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. అయితే విటమిన్ సప్లిమెంట్లను వైద్యుల సూచన మేరకే తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే విటమిన్ డి ట్యాబెట్లు ఎక్కువ వాడడం వల్ల hypervitaminosis d సమస్య వచ్చే అవకాశం ఉంది. విటమిన్ డి ట్యాబ్లెట్ శరీరంలో అధికంగా చేరి విషపూరితంగా మారిపోతుంది. దీన్నే విటమిన్ డి టాక్సిసిటీ అంటారు. అందుకే వైద్యులు విటమిన్ డి ట్యాబ్లెట్ వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also read: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.