పూర్తి ఆరోగ్యవంతమైన స్త్రీలలో పీరియడ్స్ ఎలాంటి ఆలస్యం లేకుండా సమయానికి వస్తుంటాయి. అలా సమయానికి రాకుండా ఆలస్యం అవుతుంటే ఏదో ఒక సమస్య ఉందని అర్థం. ఆ సమస్య చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. చిన్న చిన్న సమస్యలను ఇంట్లోనే సరైన ఆహారం తీసుకోవడం ద్వారా దూరం పెట్టవచ్చు. రుతుచక్రం సక్రమంగా లేకపోతే PCOS వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. PCOS వల్ల బరువు పెరగడం, ముఖంపై మొటిమలు రావడం, జుట్టు రాలడం వంటివి జరుగుతాయి. కాబట్టి క్రమరహిత పీరియడ్స్ ను సమయానికి వచ్చేలా చేసే కొన్ని రకాల ఆహారాలు ఉన్నాయి. వీటిని తరుచూ తినడం వల్ల పీరియడ్స్ సమయానికి వచ్చి ఆరోగ్యంగా ఉంటారు.
అల్లం టీ
పీరియడ్స్‌ను ప్రేరేపించే విషయంలో అల్లం టీ ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది. అల్లంలో ‘జింజర్’ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం శరీరంలో మంటను తగ్గిస్తుంది. గర్భాశయం సంకోచించే విధంగా చేస్తుంది. దీనివల్ల పీరియడ్స్ సమయానికి వస్తాయి. అల్లం టీ చేయడానికి చిన్న అల్లం ముక్కను, కప్పు నీటిలో వేసి మరిగిస్తే సరి. ఆ నీటిని వడకట్టుకుని తాగేస్తే సరిపోతుంది.
పుల్లని పండ్లు
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు పుల్లగా ఉంటాయి. వాటిలో ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. కాబట్టి అవి ఆ పుల్లని రుచిని కలిగి ఉంటాయి. ఈ పండ్లు పీరియడ్స్‌ను వచ్చేలా చేయడంలో ముందుంటాయి. ఆరెంజ్, కివి, నిమ్మ, స్ట్రాబెర్రీ, ఉసిరి వంటివి తినడం వల్ల రుతుసమస్యలన్నీ దూరమవుతాయి. వీటిని షేక్స్ రూపంలో, స్మూతీస్ రూపంలో, జ్యూస్ రూపంలో ఎలా తిన్నా మంచిదే.
బెల్లం
బెల్లంలో సోడియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి క్రమరహిత ఋతుచక్రాన్ని సెట్ చేస్తాయి. బెల్లం తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని వల్ల కూడా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. నువ్వులు, ఇతర నట్స్‌తో కలిపి బెల్లం లడ్డూలను తయారు చేసుకొని రోజుకొకటి తింటే మంచిది.
మెంతులు
ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాసు మెంతి గింజలు నానబెట్టిన నీటిని తాగితే ఎంతో మేలు. రాత్రంతా మెంతి గింజలను నానబెట్టి, ఉదయాన వడకట్టుకొని ఆ నీటిని తాగేయాలి. ఇలా చేయడం వల్ల రుతుసమస్యలన్నీ దూరమవుతాయి. సమయానికి పీరియడ్స్ వస్తాయి.
పసుపు
భారతీయ వంటల్లో పసుపుకి ప్రథమ స్థానం ఉంది. మీ ఋతుచక్రాన్ని సెట్ చేయడంలో కూడా పసుపు కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని పాలలో కలుపుకొని తాగినా, బెల్లంతో పాటూ కలుపుకుని తిన్నా మంచిదే. కూరల్లో కాస్త అధికంగా వేసుకొని తింటే మేలు.
Also read: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.