గుండె జబ్బులు ఎక్కువ కాలం పాటు లక్షణాలను చూపించవు. వచ్చే ముందు మాత్రమే కొన్ని లక్షణాలను చూపిస్తాయి. వాటిని తేలిగ్గా తీసుకుంటే అది పెద్ద సమస్యకు కారణం అవుతుంది. గుండెపోటు లేదా గుండె సమస్యలు ఏవైనా కూడా కొన్ని రకాల లక్షణాలను కొన్ని శరీర భాగాలలో చూపిస్తాయి. ఆ సంకేతాలను సాధారణమైనవిగా భావించడం వల్ల గుండె సమస్యలు ప్రాణాంతక పరిస్థితులకు చేరాక బయట పడుతున్నాయి. 


అజీర్ణం 
ప్రజలు తరచుగా అజీర్ణానికి గురవుతూ ఉంటారుజ. ఇది చాలా సాధారణ విషయంగా తీసుకుంటారు. కడుపులో మంటగా అనిపించడం అజీర్ణానికి ఒక సంకేతం. దాన్ని అజీర్ణంగానే చూస్తారు కానీ అది గుండె సంబంధిత సమస్యగా చూడరు. ఒక్కొక్కసారి అజీర్ణం లేదా అజీర్ణం వల్ల కలిగే ఛాతిలో మంట లేక కడుపులో మంట అనేది గుండెకు సంబంధించింది కూడా అవ్వచ్చు. అజీర్ణం వల్ల మరీ అసౌకర్యంగా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని కలవడం మంచిది.


ఛాతీ బిగుతు
ఛాతీ భాగంలో పెద్ద బరువు ఉంచినట్లు లేదా బిగుతుగా పట్టేసినట్లు అనిపిస్తే, అది గుండె సంబంధిత సమస్య కావచ్చు. ఛాతిలో భారం, అదనపు ఒత్తిడి ఎక్కువగా గుండెపోటుకు చెందిన ప్రాథమిక సూచికగా భావిస్తారు. ఛాతీలో నొప్పి వచ్చినా కూడా వెంటనే ఆస్పత్రికి వెళ్లడం ఉత్తమం.


దవడ, మెడ ప్రాంతంలో నొప్పి
గుండెపోటు వచ్చే సమయంలో ఛాతీలో మొదలైన నొప్పి అక్కడే ఉండిపోదు. అలా అది ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. మొదటగా దవడ, మెడ ప్రాంతాలకు వ్యాపిస్తుంది. అక్కడ ఆ రెండు ప్రాంతాల్లో చాలా నొప్పి వస్తుంది. అలా వచ్చిందంటే దాన్ని దవడ నొప్పిగానో లేక సాధారణ మెడ నొప్పిగానో భావించవద్దు. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఇలా మెడ, దవడ నొప్పి వచ్చినప్పుడు మైకంగా కూడా అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి చేరుకోవాలి.


వికారం
వికారం, కడుపుబ్బరం ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది. ఈ సమయంలో కాస్త అసౌకర్యంగా ఉంటుంది. ఇలా వికారంగా ఉండి ఛాతీ నొప్పి కూడా వచ్చి, వాంతులు అవుతుంటే వెంటనే జాగ్రత్తపడాలి. ఇది గుండె సమస్యకు ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. పొత్తికడుపు ప్రాంతంలో ఉబ్బరంగా అనిపించడం, గ్యాస్ ఏర్పడినట్లు అనిపించి అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. 


బలహీనత
నీరసం, బలహీనంగా అనిపించడం అందరికీ ఉంటుంది. అయితే గుండె సంబంధిత సమస్య ఉన్న వారిలో రోజంతా నీరసంగా, బలహీనంగానే ఉంటుంది. ఎందుకంటే వారి శరీరంలో కొన్ని భాగాలకు తగినంత రక్తప్రసరణ జరగదు. దీని కారణంగా రోగికి శ్వాస సరిగా ఆడదు. అలసటగా అనిపిస్తుంది. శారీరక శ్రమ కూడా పడలేరు. ఇలా రోజంతా మితిమీరిన బలహీనంగా అనిపిస్తే, అది గుండె సమస్యకు సంకేతం కావచ్చు.


నడుస్తున్నప్పుడు నొప్పి
నడుస్తున్నప్పుడు మోకాలి వెనక భాగంలో, పాదాల్లో నొప్పి వస్తుంటే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. వ్యాయామం చేస్తున్నప్పుడు విపరీతంగా నొప్పి వచ్చి, వ్యాయామం ఆపేసిన తర్వాత ఆ నొప్పి తగ్గిపోతే అలాంటి నొప్పిని ‘పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్’ అని పిలుస్తారు. ఇది రక్తప్రసరణకు సంబంధించిన డిజార్డర్‌కి సంకేతం. ఇది ధమనుల్లో పూడికలు ఏర్పడడానికి దారితీస్తుంది. 


Also read: మధుమేహానికి మెంతులను మించిన పరమౌషధం మరొకటి లేదు












































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.