ఎక్కువగా ఆలోచిస్తున్నారా? ఏవో పిచ్చిపిచ్చి ఆలోచనలు మైండ్‌ను వదిలి పోనంటున్నాాయా? ఎంత వదిలేద్దామనుకున్నా అవడం లేదా? ఎక్కువగా ఆలోచించకండి.. ఎందుకంటే దీని వల్ల మనఃశాంతి, చేసే పని మాత్రమే దెబ్బతినవు. ఇలా తరుచుగా ఆలోచించడం వల్ల నిరాశలో కూరుకుపోయి మానసిక రోగాలు కూడా వచ్చే అవకాశం ఉందని ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో తేలింది.


మెదడుకు భారం..


ఎక్కువగా ఆలోచించడం ద్వారా మన మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అక్కర్లేని ఆలోచనలు, మనుషులు, పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించడం, మన గురించి మనమే నెగెటివ్‌గా అనుకోవడం అసలు మంచిది కాదంటున్నారు. ఇలా ఎక్కువగా ఆలోచించడం పెద్ద రోగం ఏం కాకపోయినా భవిష్యత్తులో అది మానసిక రోగాలకు దారితీసే అవకాశం ఉందని ప్రముఖ సైకాలజిస్ట్ గరిమా జునేజా హెచ్చరిస్తున్నారు.


నిరాశ, వ్యాకులత..


చాలా సమయం మనం పాత విషయాలను గుర్తుచేసుకుంటాం. అందులోనూ సంతోషకర విషయాలకంటే బాధించిన ఘటనలే గుర్తుపెట్టుకుంటాం. పాత విషయాలపై బాధపడటం, ప్రస్తుతం విషయాల గురించి విసుగు చెందటం, భవిష్యత్తు గురించి భయపడటం అనే చాలా నెగిటివ్ ఫీలింగ్స్ అని నిపుణులు అంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే తీవ్ర నిరాశలోకి కూరుకుపోయి జీవితంపై ఆశే చచ్చిపోతుందని హెచ్చరిస్తున్నారు.


మనుషులకు దూరంగా..


అయితే ఇలాంటి లక్షణాలున్నవారు తమను అవతలి వాళ్లు ఎలా చూస్తున్నారనే విషయంపై కూడా బాధపడుతుంటారు. తరువాత మనుషులకు దూరంగా, ఒంటరిగా బతకడాన్ని అలవాటు చేసుకుంటారు.


రోజువారి జీవితంపై..


ఇలా ఎక్కువగా ఆలోచించడం వల్ల మన రోజువారి జీవితంపై ఈ ప్రభావం పడుతుంది. మనం చేసే పనులు కూడా సమర్థవంతంగా చేయలేం. ఎవరైనా ఏమైనా అడిగినా ప్రతిస్పందించే సమయం కూడా చాలా ఆలస్యమవుతుంది. దీని ద్వారా ఉద్యోగం, సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.


సమయం వృథా..


ఎక్కువగా ఆలోచించడం వల్ల మన సమయం కూడా వృథా అవుతుంది. మన మూడ్ కూడా దెబ్బతింటుంది. అయితే ఇందులోంచి బయటకు రావొచ్చని నిపుణులు అంటున్నారు. దానికి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అవేంటో చూడండి.



  • మనం దేని గురించి ఆలోచిస్తున్నామో ముందుగా గుర్తించి.. ఎప్పటికప్పుడు ఆలోచించింది చాలు.. జరిగిందేదో జరిగిపోయిందని మన మైండ్‌కి చెప్పాలి. 

  • మన పంచేంద్రియాలపై దృష్టిపెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎక్కడికో వెళ్లిపోయిన ఆలోచనను తిరిగి ప్రస్తుతంలోకి తీసుకురావొచ్చు.

  • దీర్ఘమైన శ్వాస తీసుకోవడం ద్వారా కూడా ఎక్కడికో వెళ్లిపోయిన మనస్సును మన దగ్గరికి తిరిగి తెస్తుంది.

  • యోగా వంటి సాధన ద్వారా కూడా ఈ నిరాశ నుంచి బయటపడొచ్చు.

  • దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామో వాటి గురించి డైరీలో రాయడం.. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మొదట్లోనే వాటిని ఆపేయాలి.


ఎప్పుడైనా సరే ప్రస్తుతంలో బతకడం ద్వారా మాత్రమే ఈ ఆలోచనలకు బ్రేకులు పడతాయి. అప్పుడే మన ఆలోచనలు పాజిటివ్ వైపు మళ్లుతాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు.


Also Read: Cannibal Tribes: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి