రటి అమ్మ వంటిది అని ఒక నానుడి. అరటి చెట్టులోని ప్రతి భాగం ఎన్నో పోషకాలు కలిగి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ఆహారం నుంచి అలంకరణ వరకు రకరకాలుగా దీన్ని ఉపయోగిస్తారు. ఈ చెట్టులోని కాండం, పువ్వు, కాయ, పండు, ఆకు ప్రతి ఒక్కటి భోజనానికి ఉపయోగపడేవే. చివరికి అరటి నారను ఉపయోగించి వస్త్రాలు, రకరకాల కళారూపాలు కూడా తయారు చేస్తారు. మనదేశమంతా కూడా విరివిగానూ, చవకగానూ దొరికే అరటి సుగుణాలను తెలుసుకుందాం.


అరటి పండు


అరటి చెట్టు నుంచి వచ్చే వాటిలో ముఖ్యమైనది పండు. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక మలబద్దకాన్ని నివారిస్తుంది. విటమిన్ బి6, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. శరీరం ఆహారం నుంచి ఐరన్ గ్రహించేందుకు దోహదం చేస్తుంది. రక్తం, గుండె ఆరోగ్యానికి మంచిది. గర్భిణులు తినడం చాలా మంచిది. దీనిలో ఉండే పొటాషియం కొలెస్ట్రాల్, బీపి అదుపులో ఉంచేందుకు చాలా అవసరం. కడుపులో అల్సర్లను నివారిస్తుంది.


అరటి పువ్వు


అరటి పువ్వు రక్తంలో చక్కెరల స్థాయిని నియంత్రించేందుకు చాలా ఉపయుక్తం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ కూడా. విటమిన్లు, అమైనో ఆమ్లలు సమృద్ధిగా ఉంటాయి. తక్కువ కేలరీలతో జీవక్రియలను వేగవంతం చేస్తుంది. ఇది లైంగిక అవయవాల ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు పాలిచ్చే తల్లులకు మంచి పౌష్టికాహారం. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.


అరటి కాండం


ఫైబర్ కలిగిన అరటి కాండం తినడం వల్ల శరీర కణాలలో నిల్వ ఉన్న కొవ్వు, చక్కెరల విడుదలను నియంత్రిస్తుంది. అరటి కాండం నుంచి తీసిన రసం శరీరం నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. ప్రతి రోజు ఒక గ్లాసు అరటి కాండం రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తాగం వల్ల మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తరచుగా అసిడిటితో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.


అరటికాయ


అరటి పండులో చక్కెర ఎక్కువ. అరటి కాయలో మాత్రం పండులో కంటే తక్కువ చక్కెర ఉంటుంది. అదే అరటికాయ గొప్పతనం. త్వరగా జీర్ణం కానీ రెసిస్టెంట్ స్టార్చ్ ఉండడం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇవి మేలు చేస్తాయి. అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కు ఇది చక్కని పరిష్కారం. 


అరటి ఆకు


అరటాకు తినలేము కానీ తింటే మాత్రం ఆరోగ్యానికి మంచిదట. ఎందుకంటే ఈ ఆకులలో EGCG వంటి పాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఉన్నందు వల్లే గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదైంది. అందుకే కనీసం వేడి వేడి భోజనం ఈ ఆకులో వడ్డించుకుని తినడం వల్ల కొన్ని సుగుణాలు శరీరానికి అందుతాయి. ఇవి మంచి యాంటీ బ్యాక్టీరియల్ కూడా. ఇకో ఫ్రెండ్లీ డిస్పోజబుల్ కూడా.


Also Read: ఈ కరోనా కాలంలో రోగనిరోధక శక్తి పెంచే పవర్ ఫుల్ డికాషన్ ఇదే, ఇలా తయారు చేయండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.