పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి సీడబ్ల్యూసీ, పీపీఏ హ్యాపి న్యూస్ చెప్పాయి. రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తంలో 5,036.32 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు సిఫార్స్ చేసింది. ఇందులో 1, 948.95 కోట్లను తక్షణం రీయింబర్స్ చేయాలని సూచించింది. 


పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన వ్యయంలో 5,036.32 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సీడబ్ల్యూసీ, పీపీఏ సూచించింది. ప్రాజెక్టు కోసం నేరుగా రాష్ట్ర ప్రభుత్వం 1, 948.95 కోట్లు ఖర్చు పెట్టింది. భూసేకరణ, నిర్వాసితుల పునారావాసం కోసం మార్చి వరకు 2,242.25 కోట్లు వెచ్చించింది. ప్రాజెక్టు పనులకు ముందస్తుగా 3,087.37 కోట్లు ఇవ్వాలని  సీడబ్ల్యూసీ, పీపీఏ సిఫార్స్ చేసింది. 


కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ చంద్రశేఖర్‌, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ సీఈవో శివనందకుమార్‌ పోలవరం నిధులకు సంబంధించిన సిఫార్స్ చేశారు. పోలవరానికి 5,036.32 కోట్లను విడుదల చేయాలని ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు పంపారు. ఆయన పూర్తిగా పరిశీలించి ఆమోద ముద్రవేయనున్నారు. అనంతరం ఆఫైల్‌ ఆర్థిక శాఖ టేబుల్‌పైకి వెళ్తుంది. ప్రక్రియ పూర్తైన తర్వాత రెండు వారాల్లో రీయింబర్స్ చేయాల్సిన 1,948.95 కోట్లు విడుదల కానున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాధికారులు అంచనా వేస్తున్నారు. 


మార్చి వరకూ చేయాల్సిన పనులకు అవసరమైన 3,087.37 కోట్లను ముందస్తుగా విడుదల చేస్తే... తొలి దశ పనులకు నిధులు సమస్య ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈలోపు 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం 55, 458.87 కోట్ల వ్యయాన్ని కేంద్రం ఆమోదిస్తుందన్న ధీమా రాష్ట్రప్రభుత్వంలో ఉంది. సవరించిన అంచనా వ్యయంపై కేంద్రమంత్రిమండలి ఆమోద ముద్ర వేస్తే పోలవరం ప్రాజెక్టును గరిష్ఠ నిల్వ 194.6 టీఎంసీలను నిల్వచేసే స్థాయిలో పూర్తి చేయొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  


పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకు  20,702.58 కోట్లు వెచ్చించింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు 4, 730.71కోట్లు ఖర్చు చేస్తే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 15, 971.87కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 13, 098.57 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. ఇంకా రూ. 2,873.30 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సి ఉంది.   కేంద్ర జల్‌శక్తి శాఖ సూచనల మేరకు రీయింబర్స్‌ చేయాల్సిన 2,873.30 కోట్లు త్వరగా విడుదల చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూనే ఉంది. దీంతోపాటు మార్చి వరకూ భూసేకరణ, సహయ పునరావాసం కల్పనకు 2,288.55 కోట్లు, ప్రాజెక్టు పనులకు 2.118 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. వీటన్నింటినీ పరిశీలించిన సీడబ్ల్యూసీ, పీపీఏ 5, 306.32కోట్లను విడుదల చేయాలంటూ కేంద్రానికి సిఫార్స్ చేసింది.


డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం పూర్తి


పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యాంలో వరదలతో దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని పూర్తి అయింది. దీనిపై ఏపీ జలవనరుల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దిగువ కాఫర్‌ డ్యాం పటిష్టంగా నిర్మించాలంటే డయాఫ్రమ్ వాల్ తప్పనిసరని నిపుణులు చెప్పడంతో ఈ నిర్మాణం చేపట్టారు. పోలవరం పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ 160 మీటర్ల పొడవున ఇసుక, జియో బ్యాగ్‌లతో నింపి వైబ్రో కంప్రెషన్ ద్వారా గట్టిపరిచినట్టు పేర్కొన్నారు. పనులు పూర్తైన సందరర్భంగా అక్కడ కాంట్రాక్టర్‌ల ప్రతినిధులు పూజలు చేశారు.