East Godavari News : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పన్నులు చెల్లించాలంటూ ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.  ఖాళీ స్థలాల పన్ను (వీఎలీ) చెల్లించాలని ప్రభుత్వ అధికారులు పెడుతున్న ఈ హెచ్చరిక బోర్డులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఖాళీ స్థలాలకు పన్ను కట్టాలని అధికారులు నోటీసులు ఇవ్వాలని కానీ ఇలా హెచ్చరిక బోర్డులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పన్నులు చెల్లించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కానీ  ప్రభుత్వ స్థలంగా భావించి సచివాలయాలు కట్టేస్తామని  ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. ఇతరత్రా భవనాలు నిర్మించేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం చూస్తుంటే ఖాళీ స్థలాలపై ప్రభుత్వ కన్ను పడిందా అన్న విమర్శలు వస్తున్నాయి.  మరో వాదన కూడా లేకపోలేదు. పన్ను కట్టకుండా తప్పించుకుంటున్న స్థలాల యాజమానులు  స్పందించకపోవడం వల్లే ఈ చర్యలు అంటూ అధికారులు తమ వాదన వినిపిస్తున్నారు.  


ఆ స్థలాల వైపు కన్నెత్తి చూడని అధికారులు!


ఈ ఫ్లెక్సీలపై రాజమండ్రి నగరపాలక కార్యాలయాన్ని జనసేన కార్యకర్తలు, నాయకులు ముట్టడించారు. అదేవిధంగా పలువురు ప్రజాసంఘాల నాయకులు కూడా అధికారుల తీరును తప్పుపడుతున్నారు. రాజమండ్రి నగరంలోని దాదాపు 1600 ఖాళీ స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో  అధికారులు గుర్తించినవి 650 మాత్రమే. పన్ను బకాయి రూ.4 కోట్ల వరకు రావాల్సి ఉంది. వీటిలో సగం స్థలాల్లో  అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. రాజకీయ పరపతి, ఇతర మద్దతు ఉన్న ఖాళీ స్థలాలవైపు కన్నెత్తి చూడకపోవడంపైనా చర్చ నడుస్తోంది. నిజానికి నగరంలో 2,930 స్థలాలు గుర్తించినా.. రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా  కారణాలతో మిగిలిన స్థలాలకు పన్ను వేసే సాహసం చెయ్యడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.


కాకినాడలోనూ ఇదే తంతు 


ఇదే పరిస్థితి కాకినాడలోని కూడా కనిపిస్తుంది. కాకినాడ నగరంలో 2930 ఖాళీ స్థలాలను గుర్తించారు.  నగరంలో ఖాళీ స్థలాల నుంచి ఏటా రూ.4.88 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉంటే.. పన్ను బకాయిలు రూ.24 కోట్లు ఉండడం గమనార్హం. అయితే కాకినాడలో రాజకీయ పలుకుబడి ఉన్న స్థల యజమానులకు మాత్రం ఎటువంటి నోటీసులు అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 


జనసేన ఆందోళన 


"ఇప్పటికే దివాళా తీసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కబ్జాకోరు అవతారం ఎత్తింది. అర్బన్ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలుంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ ఎవరైనా పన్ను కట్టకపోతే మున్సిపల్ అధికారులు వారికి నోటీసులు ఇచ్చి పన్నులు వసూలు చేసేవారు. కానీ ప్రజలకు నోటీసులు కూడా ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలు పెట్టారు. ఖాళీ స్థలాల్లో ఫ్లెక్సీలు పెట్టి ప్రభుత్వ నిర్మాణాలు చేపడతామని హెచ్చరించడం దారుణం. ఖాళీ స్థలాలను కబ్జా చేయాలనే ఆలోచన ఇది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను వైసీపీ నేతలు కబ్జా చేసేశారు. విశాఖలో దస్పల్లా భూములు, రుషికొండ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. ఇవాళ మరో అడుగుముందుకేసి వ్యక్తిగత ఆస్తులను ఆక్రమించాలనే ఆలోచన చేయడం దారుణం. మార్చి నెలాఖరుకి రూ.600 కోట్ల ఆదాయం లక్ష్యంగా మున్సిపల్ అధికారులు ఈ ఆలోచన చేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున ఈ విధానాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కల్లుతెరిచి వ్యక్తిగత ఆస్తులపై దాడులను మానుకోవాలి. లేకపోతే జనసేన పార్టీ తరఫున ఉద్యమం కొనసాగిస్తాం. " -కందుల దుర్గేష్ , జనసేన నేత