హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన తొలి వారంలోనే బాక్సాఫీస్ వసూళ్లు $435 మిలియన్ల(దాదాపు ₹ 3,598 కోట్లు)కు చేరాయి. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని రీతిలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కానీ, జపాన్‌ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. అక్కడ ‘ది ఫస్ట్ స్లామ్ డంక్’ అనే యానిమే బాస్కెట్‌ బాల్ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. అన్ని థియేటర్లలో అక్కడ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ‘అవతార్: ది వే ఆఫ్ ది వాటర్’ పెద్దగా ఆడటం లేదు. అయితే, ప్రేక్షకులు లేకపోవడం వల్ల కాదు. దానికి కారణం అక్కడి థియేటర్లలో ఉన్న టెక్నాలజీ ‘అవతార్-2’ను తట్టుకోలేకపోవడమే.   


ధ్వంసమవుతోన్న ప్రొజెక్టర్లు


కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అత్యాధునిక టెక్నాలజీతో రూపొందింది. ఈ టెక్నాలజీ అక్కడి థియేటర్లలో ఉన్న టెక్నాలజీతో సరిపోవడం లేదు. జపాన్ వ్యాప్తంగా కొన్ని సినిమా థియేటర్లలో స్క్రీనింగ్ పరికరాలు క్రాష్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పలు థియేటర్లు ఆ సినిమా ప్రదర్శనను నిలిపేశాయి. ‘అవతార్ 2’ చూసేందుకు వెళ్లిన చాలా మంది ప్రేక్షకులు షోస్ క్యాన్సిల్ చేయడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఆయా థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులకు డబ్బులు వాపస్ చేస్తున్నాయి. సాంకేతిక సమస్యల కారణంగానే సినిమా ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి.       


హాలీవుడ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌ లలో ఒకటైన  ‘అవతార్ 2’ చిత్రంలో చాలా అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది హై ఫ్రేమ్ రేట్ 3D ఫార్మాట్ ను కలిగి ఉంది. ఈ కారణంగా చాలా డేటాను త్వరగా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అయితే, జపాన్ థియేటర్లు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనుకబడినట్లు కనిపిస్తోంది. అందుకే ‘అవతార్ 2’ చిత్రాన్ని అక్కడి థియేటర్లు ప్రదర్శించలేకపోతున్నాయని నిపుణులు అంటున్నారు. 


ఫ్రేమ్స్ కుదించి ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లు


జపాన్ లోని చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల సమస్యను పరిష్కరించే దిశగా థియేటర్ల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నాగోయాలోని ఒక థియేటర్ సెకనుకు అవసరమైన 48 ఫ్రేమ్‌లను  24 fpsకి తగ్గించడం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. థియేటర్ యాజమాన్యం ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. ’అవతార్: వే ఆఫ్ వాటర్’ IMAX వెర్షన్ గురించి ఓ కీలక ప్రకటన మీకోసం.. ఈ చిత్రం వాస్తవానికి అధిక ఫ్రేమ్ రేట్ వెర్షన్‌(48 fps)లో ప్రదర్శించాలని ప్లాన్ చేశాం. కానీ, వివిధ పరిస్థితుల కారణంగా సాధారణ ఫ్రేమ్ రేట్ వెర్షన్ ప్రదర్శిస్తున్నాం. 24 fps వెర్షన్ లో ప్రదర్శించనున్నామని ప్రకటిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. మా థియేటర్‌లో ‘అవతార్: వే ఆఫ్ వాటర్’ IMAX వెర్షన్‌ ను వీక్షించే కస్టమర్‌లను అర్థం చేసుకోవాలని మేం కోరుతున్నాం. ధన్యవాదాలు," అని రాసుకొచ్చింది.


Read Also: వామ్మో, ప్రాణాలు పోతే? హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ డేరింగ్, సినిమా చరిత్రలోనే అత్యంత ప్రమాదకర స్టంట్!