హైదరాబాద్‌ నూతన సంవత్సర వేడుకలకు సిద్ధం అవుతోంది. ఈసారి మరింత ఘనంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రత్యేక వేడుకల కోసం నిర్వాహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 


అయితే నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు హైదరాబాద్‌ పోలీసులు నిబంధలు కఠిన తరం చేశారు. వేడుకలను రాత్రి ఒంటిగంట వరకూ నిర్వహించుకునేందుకు 3 నక్షత్ర, అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వహకులు, యాజమాన్యాలు 10 రోజుల ముందుగానే  పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. వేడుకలు నిర్వహించే ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లోనూ సీసీ కెమెరాలు అమర్చాలని, ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని సూచించారు. అసభ్యకర నృత్యాలు, అల్లర్లు జరగకుండా చూడాలని.. వేడుకల ప్రాంగణంలో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని ఆదేశించారు. మారణాయుధాలను వేడుకల ప్రాంతాల్లోకి అనుమతించకూడదని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని సూచించారు. 


నిర్దిష్ట పరిమితికి మించి టికెట్లు, పాసులు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. నిర్వహకులు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని.. సాధారణ ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు. జంటల కోసం పబ్బులు, బార్లలో నిర్వహించే వేడకలకు మైనర్లను అనుమతించకూడదన్నారు. వేడుకల్లో మాదక ద్రవ్యాలు సరఫరా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని తెలిపారు. ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం దాటిన తర్వాత మద్యం సరఫరా చేయకూడదని.. వేడుకల తర్వాత మద్యం సేవించిన వారు వాహనం నడపకూడదని, వారు ఇంటికి చేరేలా చూసే బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు.


గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు. 


గత ఏడాది నగరంలో జరిగిన అనేక పార్టీల్లో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా సప్లై అయినట్లు పోలీసుల సోదాల్లో వెల్లడైంది. ఇప్పటికీ ఆ కేసుల్లో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు. మూడు కమిషనరేట్ల పరిధిలో కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. పోలీసుల కళ్లు గప్పి కొంతమంది డ్రగ్స్ సప్లై చేసేవారపై నజర్ పెట్టారు. వివిధ మార్గాల్లో గంజాయిని తీసుకొచ్చే అవకాశం ఉన్ననేపథ్యంలో పోలీసులు కూడా తనిఖీలు కూడా అదేస్టైల్లో చెక్ పెట్టాలని చూస్తున్నారు. 


కఠిన నిబంధనలు. అతిక్రమించే చర్యలు తప్పవ్. 


న్యూ ఇయర్ వేడుకలు నిర్వమించే వారు ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలి. అర్థరాత్రి ఒంటి గంట తర్వాత కూడా పార్టీ కొనసాగించే హోటల్స్, పబ్‌లకు పోలీసుల పర్మిషన్ తప్పనిసరి. పార్టీ జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆయుధాలను, డ్రగ్స్ లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని నగర కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డీజే, సౌండ్ సిస్టంపై ప్రత్యేక నిఘా ఉండబోతుంది. విపరీతమైన సౌండ్ తో చుట్టుపక్కల వారికి ఇబ్బంది గురిచేస్తే కఠిన శిక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మధ్యాహ్నం నుంచి తెల్లవారు జామున వరకు కొనసాగే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పదివేలు ఫైన్ లేదా ఆర్నెల్లు జైలు శిక్ష, మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందని పోలీసులు హెచ్చరించారు.


న్యూ ఇయర్ వేడుకలపై కరోనా న్యూ వేరియంట్ ప్రభావం. 


న్యూ ఇయర్ వేడుకలపై కరోనా బీఎప్ 7 వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉంది. న్యూ ఇయర్ వేడుకల కోసం నిర్వాహకులు ఇప్పటికే  పెద్ద ఎత్తున టిక్కెట్లు అమ్మేశారు. ఈవెంట్స్ కంపెనీలకు కూడా పేమెంట్స్ అయిపోయాయి. సో ఈ టైం కరోనా బీఎఫ్ 7 వేరియంట్ ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ కరోనావ్యాప్తి ఎంత స్పీడ్ గా ఉంటుందో గత అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. 


బీఎఫ్.7పై నేడు హరీశ్‌రావు సమీక్ష
కరోనా బీఎఫ్‌.7 వేరియంట్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం కూడా ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన నేపథ్యంలో.. కొవిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ముఖ్యంగా.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని, ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. విమానాశ్రయంలోనూ వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాలణికులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు పదిలోపు ఉంటున్నాయి. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాల్లో మినహా.. మిగతా చోట్ల జీరో కొవిడ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం సగటున ఐదు వేల పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీఎఫ్‌.7 నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రమంతటా పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. మన దగ్గర ఇప్పుడు కొవిడ్‌/బీఎఫ్‌.7 ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ దాదాపుగా పూర్తయిందని.. సింహభాగం ప్రజల్లో హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ ఉందని అధికారులు చెబుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై కూడా ఈ సమీక్షలో చర్చించనున్నారు.