చెప్పుకోవడానికి చిన్న సమస్యగా కనిపించే డయాబెటిస్, కాస్త అలసత్వం వహించినా కూడా శరీరాన్ని కుళ్ళిపోయేలా చేస్తుంది. అనేక ప్రాణాంతక రోగాల రాకను ఆహ్వానిస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన త్వరగా పడేలా చేస్తుంది. చాలా చిన్న చిన్న గాయాలు కూడా తగ్గకుండా. అవి పెద్ద పుండ్లుగా మారేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్‌ను తక్కువగా అంచనా వేయకూడదు. ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండానే డయాబెటిస్ దాడి చేస్తుంది. అంతకుముందు 50 ఏళ్లు దాటితేనే ఈ చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఉండేది. 


ఇప్పుడు 30 ఏళ్లు దాటిన వారిలో కూడా ఇది కనిపిస్తోంది. కాబట్టి మూడు నెలలకు ఒకసారి మధుమేహం పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ముందుగానే దాని రాకను పసిగట్టవచ్చు. జాగ్రత్తలు తీసుకుంటే జీవితాంతం సంతోషంగా జీవించవచ్.చు అయితే చాలామంది ఈ ఆధునిక కాలంలో నిద్రకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నిద్రకు మధుమేహానికి మధ్య చాలా గట్టి అవినాభావ సంబంధమే ఉంది. నిద్ర తగ్గినా కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఒకరోజు లేదా రెండు రోజులు నిద్ర తగ్గినంత మాత్రాన మధుమేహం వస్తుందని చెప్పడం లేదు, కానీ దీర్ఘకాలంగా తక్కువ నిద్రపోతున్న వాళ్ళు, అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండేవాళ్లు, మధుమేహం బారిన త్వరగా పడే అవకాశం ఉంది. ‘సెంటర్ ఫర్ దిస్ ఇస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ సంస్థ చెబుతున్న ప్రకారం ఒక క్రమ పద్ధతిలో నిద్రపోని వారిలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులలో ‘టైప్ టూ మధుమేహం’ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 2009లోనే ఈ విషయాన్ని ఒక అధ్యయనం తేల్చింది. 


నిద్రలేమితో...
నిద్రలేమి వల్ల గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుందిజ. అలాగే లెప్టిన్ అనే సంతృప్తి హార్మోన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కంటినిండా నిద్రపోవడం చాలా అవసరం. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతున్న ప్రకారం పెద్దవాళ్లు రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అది కూడా రాత్రి పూట నిద్రపోతేనే మంచి ఫలితాలు వస్తాయి. మధ్యాహ్నం రెండు గంటలు పడుకొని రాత్రి ఓ ఆరు గంటలు పడుకుంటే సరిపోతుంది అనుకోవద్దు. ఏడు నుంచి ఎనిమిది గంటలు పూర్తిగా రాత్రిపూట నిద్రపోయేలా చూసుకోవాలి. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి ఆ తర్వాత ఏడెనిమిది గంటలు పడుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు రావు.


రోజుకో సమయంలో నిద్ర పోవడం కూడా మంచి పద్ధతి కాదు. ఒక స్లీపింగ్ పాటర్న్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఇది మెదడులో నిద్ర వచ్చే సమయాలను ఫిక్స్ చేస్తుంది. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కోవడం అనేది మీకు మంచి నిద్రను అందిస్తుంది. నిద్రపోవడానికి తగ్గ పరిస్థితులు మీ గదిలో ఉండేలా చూసుకోవాలి. ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను నిద్రపోవడానికి అరగంట ముందే దూరంగా పెట్టాలి. గది చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. నిద్ర రానప్పుడు ఏదైనా పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి. ఓదార్పుగా ఉండే సంగీతం విన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.


మీరు తినే ఆహారం కూడా మీ నిద్రను నిర్ణయిస్తుంది. రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తినడమే చాలా మంచిది. మసాలా దట్టించిన స్పైసీ ఆహారాన్ని తింటే నిద్ర సరిగా పట్టదు. పొట్టలో ఇబ్బందిగా ఉండి మెలకువ వచ్చేస్తుంది. కాబట్టి నిద్రించడానికి మూడు గంటల ముందే తేలికపాటి పోషకాహారాన్ని తిని కాసేపు నడవడం ఉత్తమం. ఇలా చేస్తే మధుమేహం రాకుండా ముందే అడ్డుకోవచ్చు.


Also read: డుకాన్ డైట్ గురించి తెలుసా? బ్రిటన్ యువరాణి మెరుపుతీగలా ఉండడానికి కారణం ఇదే























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.