పాకిస్తాన్‌కు ఆనుకొని ఉన్న అరేబియా సముద్రంలో ఏర్పడిన ట్రఫ్ కారణంగా తెలుగురాష్ట్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా. ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా తగ్గిందని.. ఇది మరింత తగ్గనుంది. అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాత్రం చలి ప్రభావం కాస్త ఉంటుంది. కానీ గతంతో పోలిస్తే తగ్గనుంది. 


శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో తేమ గాలులు వీయనున్నాయి. ముఖ్యంగా ఏపీకి దక్షిణ భాగంలో వీటి ప్రభావం ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో వెచ్చని వాతావరణం ఉంటుంది. విశాఖ విజయనగరం, పార్వతిపురం, మన్యం, అరకలో వెచ్చని వాతావరణం కనిపిస్తుంది. అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రదేశాల్లో కాస్త చలిగా ఉంటుంది. 


ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ కూడా వెచ్చటి గాలులు వీస్తుంటాయి. దీని వల్ల చలి తీవ్రత తగ్గిపోనుంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌,హైదరాబాద్, మెదక్‌లో చల్లని వాతావరణం ఎక్కువగా ఉంటుంది. గతంలో పోలిస్తే మాత్రం తగ్గతుంది. మిగిలిన ప్రాంతాల్లో వెచ్చని వాతావరణం ఉంటుంది. 


ఎప్పుడైనా చలి కాలం నుంచి ఎండా కాలానికి వెళ్లేటప్పుడు మారిన వాతారణం కారణంగా వర్షాలు పడటం సహజం. ఈసారి కూడా జనవరి ఆఖరిలో వర్షాలు పడే  సూచనలు కనిపిస్తున్నాయి. గత పది సంవత్సరాల్లో ప్రతిసారి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఏదో ఒక నెలలో వర్షాలు చూస్తున్నాం. ఈసారి జనవరి చివరి వారంలో వర్షాలు పడే అవకాశం ఉంది. సాధారణంగా జనవరి చివరి వారానికి చలి తగ్గుముఖం పడుతూ పగటి వేళలో వేడి పెరుతుంది. రాత్రి చల్లగా ఉంటుంది.


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టే హిమాలయాలు, మధ్య ఆసియా మీదుగా కూడా భూమిలోనే అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది సాధారణంగా ఇరాన్, ఇరాక్‌లో ఉన్న ఎడారిలో ఏర్పడి హిమాలాయాలు, ఉత్తర భారత దేశం వైపుగా వెళ్తుంది. దీనినే వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటారు. పశ్చిమ గాలుల ప్రభావం అని కూడా అనొచ్చు. ఇది సాధారణంగా తెలుగు రాష్ట్రాల వైపు ప్రభావం చూపదు. కానీ ఎప్పుడైనా బలంగా ఏర్పడినప్పుడు మాత్రం ఎఫెక్టు ఉంటుంది. 


ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది. 24న పాకిస్థాన్, అరేబియ సముద్ర మీదుగా ఏర్పడిన ట్రఫ్ కారణంగా కూడా వర్షాలు పడొచ్చు. ఇది ఎంత వరకు ప్రభావం చూపుతుంది. ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చని మాత్రం సోమవారానికి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికేతే మాత్రం శ్రీలంక మీదుగా ఏర్పడిన ఆవర్తనం కారణంగా జనవరి 27, 28 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తుంపరులతో కూడిన జల్లులు పడొచ్చు.