KL Rahul Athiya Shetty Wedding: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి పెళ్లికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ స్టార్ కపుల్ పెళ్లి జనవరి 23న ఖండాలాలోని జష్న్ బంగ్లాలో జరగనుంది. సునీల్ శెట్టి తన కుమార్తె వివాహానికి చాలా సన్నిహితులు మాత్రమే హాజరవుతారని ఇప్పటికే చెప్పారు.


ప్రస్తుతం కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహానికి హాజరయ్యే ప్రత్యేక అతిథులు ఎవరనే విషయంపై ఊహాగానాలు జరుగుతున్నాయి. షారూఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహానికి హాజరుకావచ్చని కొందరు అనుకుంటున్నారు.


సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ తన కుమార్తె వివాహానికి హాజరవుతారని సునీల్ శెట్టి ఇంకా ధృవీకరించలేదు. అయితే కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహంలో సల్మాన్, షారుఖ్, విరాట్‌లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా హాజరవుతారని కొందరు నమ్ముతున్నారు.


ఒకవైపు రాహుల్, అతియాల పెళ్లికి సన్నాహాలు జోరందుకున్నాయి. సునీల్ శెట్టికి సన్నిహితులు ఖండాలాకు రావడం ప్రారంభించారు. జనవరి 21వ తేదీ నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.నేడు లేడీస్ నైట్ సంగీత్ వేడుకను నిర్వహించనున్నారు. అతిథుల కోసం సునీల్ శెట్టి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. రాహుల్ - అతియా సాధారణ వివాహం చేసుకోవాలనుకుంటున్నారు.


సునీల్ శెట్టి, మనా దంపతులు తమ కుమార్తె వివాహాన్ని చిరస్మరణీయంగా చేయాలని అనుకుంటున్నారు. ఎనిమిది బెడ్‌రూమ్‌లు కాకుండా, జష్న్ బంగ్లా ముందు పెద్ద మైదానం ఉంది. ఇక్కడే వివాహ సమయంలో బహిరంగ సంబరాలు జరిగే అవకాశం ఉంది.


రాహుల్ మరియు అతియా వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. నటుడు సునీల్ శెట్టి తన కుమార్తె, కేఎల్ రాహుల్ వివాహం చాలా సింపుల్‌గా చేయాలనుకుంటున్నారని గతంలోనే ధృవీకరించారు.


ఇక కేఎల్ రాహుల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే... భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా రాహుల్ రాణించలేకపోయాడు. పిచ్‌పై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను నిరంతరం కష్టపడ్డాడు. తన పేలవ ప్రదర్శనతో రాహుల్ విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా అతనిపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు రాహుల్ దూరమయ్యే అవకాశం ఉందని జాఫర్ చెప్పాడు.


బంగ్లాదేశ్‌లో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల హోమ్ టెస్ట్ సిరీస్‌కు రాహుల్ తుదిజట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ 22, 23, 10 మరియు 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముఖ్యంగా ఈ భారత ఓపెనర్ 2022లో నాలుగు టెస్టుల్లో 17.13 సగటుతో 137 పరుగులు మాత్రమే చేశాడు.


వసీం జాఫర్ అభిప్రాయం ప్రకారం కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. రోహిత్ శర్మ వస్తే కేఎల్‌ తప్పుకోవాల్సి ఉంటుంది. 145 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కష్టపడటంపై కూడా జాఫర్ స్పందించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించేందుకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అనుమతించారన్నారు. కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్‌ల డిఫెండింగ్ వ్యూహాన్ని కూడా ప్రశ్నించాడు.