ఏ డైట్ అయినా బరువు తగ్గించడం, ఆరోగ్యం కోసం రూపొందించినదే. అధిక బరువు అనేది ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారడంతో రకరకాల డైట్లు పుట్టుకొస్తున్నాయి. అలా పుట్టుకొచ్చిన డైట్లలో డుకాన్ డైట్ ఒకటి.బ్రిటన్ యువరాణి, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్ ఫాలో అయ్యేది ఈ ఆహారపద్ధతినే. ముగ్గురు పిల్లలు తల్లి అయినా మెరుపు తీగలా కనిపించడం ఆమె ప్రత్యేకత. ఆమె తినే ఆహారం, వ్యాయామం ఆమెను అలా కనిపించేలా చేస్తాయి. 


ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన మహిళల్లో కేట్ కూడా ఒకరు. ఆమె ఏం తింటుందో వెతికే వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది. ప్రస్తుతం ఆమె డుకాన్ డైట్‌ను ఫాలో అవుతున్నట్టు గూగుల్ ద్వారా తెలుసుకున్నారు ప్రజలు. అధిక ప్రోటీన్ ఉండడం ఈ డైట్ స్పెషాలిటీ. ఈ డుకాన్ డైట్ ప్రపంచంలోనే అత్యధిక మంది అనుసరించే ఆహార పద్ధతుల్లో తొమ్మిదో స్థానంలో ఉంది. డుకాన్ డైట్లో భాగంగా ప్రోటీన్‌తో కూడిన ఆహారాన్ని అధికంగా తినడం మాత్రమే కాదు, పిండి పదార్థాలు, కొవ్వులు ఉండే ఆహారం తగ్గించి తినాలి. అప్పుడు బరువు తగ్గడమే కాదు, అందం, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఈ డైట్లో భాగంగా తినే ఆహారంలో సహజసిద్ధమైన ఆహారాలే అధికంగా ఉంటాయి. క్యాలరీలను బర్న్ చేయడం, శరీరానికి బలాన్ని, శక్తిని ఇవ్వడం దీని ప్రత్యేకత. అలాగే శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. 


ఈ డైట్‌ను 1970లో ఫ్రెంచ్ పోషకాహార నిపుణుడు పియరి డుకాన్ రూపొందించాడు. లీన్ ప్రోటీన్ తినడం, ఎక్కువ నీరు తాగడం, అరగంట పాటు నడవడం డుకాన్ డైట్లో భాగాలు. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగానే తీసుకుంటారు. దీని వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.ఈ డైట్ లో భాగంగా ఓట్స్, బీన్స్, వంకాయ, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, పాలకూర వంటి పిండి లేని పదార్థాలను అధికంగా తింటారు. చేపలు, మాంసం, గుడ్లు వంటి ప్రోటీన్ ఆహారాలను మితంగా తింటారు. అధికంగా నీళ్లు తాగుతారు. 30 నిమిషాలు పాటు వ్యాయామం ఉంటుంది. పండ్లు అధికంగా తింటారు. దీని వల్ల బరువు ఆటోమేటిక్‌గా తగ్గుతారు. నెల రోజులు ఈ డైట్ పాటించి చూడండి, ఓసారి పోషకాహార నిపుణులను కలిసి ప్రారంభించడం మంచిది.






Also read: పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ పరీక్ష చేయించుకోవడం బెటర్























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.