ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు కావివి, ప్రభుత్వ అధికారులు తీసిన లెక్కలు. నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు అనే కార్యక్రమం నత్తనడకన సాగుతోందనడానికి గణాంకాలే ఉదాహరణలు. ఎప్పటికప్పుడు టార్గెట్లు, డెడ్ లైన్లు పెట్టుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనుకుంటున్నా ఎందుకో అవి నత్తనడకన సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు ఇచ్చి సరిపెట్టినా నచ్చినవారు ఇప్పటికే ఇళ్లను పూర్తి చేసేవారేమో. కానీ ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇస్తామనే సరికి చాలామంది ఆశపడ్డారు, అక్కడితో అది అయిపోలేదు, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం పరిమితంగా ఉండటం, ఇప్పుడు గృహనిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడంలేదు. దీంతో నెల్లూరు జిల్లాతో సహా అన్ని చోట్ల జగనన్న కాలనీల నిర్మాణం వేగం పుంజుకోలేదు. 


ఉగాది టార్గెట్.. 
తాజాగా నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాబోయే ఉగాది నాటికి నెల్లూరు జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో గృహ నిర్మాణాల పురోగతిపై  జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఉగాది నాటికి 16 వేల ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటికి 5113 ఇళ్ళు పూర్తయ్యాయని, వివిధ దశలలో ఉన్న మిగిలిన ఇళ్లను త్వరితగతిన పూర్తిచేసి పేదలకు పండుగ వాతావరణంలో అందజేయడానికి అధికారులంతా వ్యక్తిగత శ్రద్ధ పెట్టి కృషి చేయాలన్నారు. రాబోయే కాలం ఎలాంటి ఆటంకాలు లేకుండా పని జరిగే సీజన్ అని, అందుకే నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతివారం కచ్చితమైన పురోగతి ఉండే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి శనివారంను హౌసింగ్ డే గా నిర్దారించామని చెప్పారు. అధికారులందరూ క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. 


సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుండి మండల ప్రత్యేక అధికారులు, హౌసింగ్ జిల్లా స్థాయి అధికారి వరకు అందరూ ప్రత్యేక దృష్టి పెట్టి గృహ నిర్మాణాలను అనుకున్న సమయానికి పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు కలెక్టర్ చక్రధర్ బాబు. నిర్లిప్తంగా ఉన్న అధికారులను సహించేది లేదన్నారు. మంచి నాణ్యత కలిగిన ఇసుక, సిమెంట్ ఇటుకలు తదితర నిర్మాణ సామాగ్రిని  గృహ నిర్మాణాలకు అంతరాయం లేకుండా అందించాలన్నారు. ఆర్డీవోలు సంబంధిత బ్రిక్స్ తయారీ యూనిట్ల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి ముందస్తుగా నిర్మాణ సామాగ్రి అందించడానికి కృషి చేయాలన్నారు. ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నిర్మాణం జరిగే ప్రతి దశను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. నియోజకవర్గ వారీగా ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు కలెక్టర్. 


నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వాడివేడిగా ఈ సమావేశం జరిగింది. ఈసారయినా ఉగాదికి టార్గెట్ పూర్తి చేస్తారా లేక యధావిధిగా టార్గెట్ ని పొడిగిస్తారా అనేది వేచి చూడాలి. జగనన్న కాలనీలపై ఆశ పెట్టుకున్న పేదలు మాత్రం ఇళ్లలో చేరే మహూర్తాలకోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సాయంతోనే కొంతమంది ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్నారు. వారంతా ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంగా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కాలనీలకు మౌలిక వసతుల పేరుతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా.. చాలా చోట్ల అసలు ఇళ్ల నిర్మాణమే పూర్తి కాకపోవడం విశేషం.