గోళ్లు కొరకడం అనేది మంచి అలవాటు కాదు. గోళ్లు కొరికే అలవాటు ఉంటే అది మానుకోవడం చాలా మంచిది. లేకపోతే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. గోళ్లు అపరిశుభ్రంగా ఉండడం వల్ల వాటిని నోట్లో పెడితే అంటురోగాలకు కారణం కావచ్చు. అంతేకాదు గోరు చుట్టూ ఉండే చర్మానికి గాయం కలిగి చికాకు, మంట వస్తుంది. ఒక్కొక్కసారి ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌గా మారిపోతుంది. దీన్ని పరోనిచియా అని పిలుస్తారు. బ్యాక్టీరియా చర్మపు సందుల్లోంచి గోరు మడతల్లోకి ప్రవేశించి అక్కడ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది తీవ్రమైన నొప్పిని, మంటను కలిగి ఉంటుంది. చీము కూడా పడుతుంది. ఇది ఎక్కువైతే జ్వరం, అలసట, మైకం వంటివి కమ్ముతాయి. వేలు లోపలికి ఈ ఇన్ఫెక్షన్ చేరితే ఒక్కొక్కసారి ఆ వేలును తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.
గోళ్లను కొరకడం, నోటితో తీయడం, అందం కోసం చేయించుకునే చికిత్సల వల్ల చర్మం దెబ్బతిని ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇది స్టెఫీలో కాకస్, ఎంట్రో కాకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుందని వైద్యులు చెబుతారు. కొన్ని వారాలపాటు ఇది ఇబ్బంది పెడుతుంది. ఎక్కువగా నీటిలో పనిచేసే వ్యక్తుల్లో ఇది కలుగుతుంది.
ఇది వస్తే లక్షణాలు ఎలా ఉంటాయంటే
1. గోరుచుట్టు చర్మం ఎరుపుగా మారుతుంది.
2. అక్కడ చర్మం సున్నితంగా మారి ముట్టుకుంటే నొప్పి వస్తుంది.
3. గోరుచుట్టు చీముతో నిండిన పొక్కులు వస్తాయి.
4. ముట్టుకుంటే గోరు చాలా నొప్పిగా అనిపిస్తుంది.
5. ఈ ఇన్ఫెక్షన్ అధికంగా మారితే జ్వరం, మైకం సమస్యలు మొదలవుతాయి.
ఎలా నివారించాలి
గోరు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ చేతులను కడిగిన తర్వాత వెంటనే తుడుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. గోళ్లు కొరకడం చేయకూడదు. మీరు వాడే నెయిల్ కట్టర్‌ను ఇతరులతో ఎప్పుడూ షేర్ చేసుకోకండి. ఉపయోగించిన తర్వాత నీళ్లు శుభ్రపరచుకోవాలి. చేతి గోళ్లు శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. గోళ్లను ఎక్కువసేపు నీటిలో నాననివ్వకూడదు. గోళ్లు పెద్దగా పెంచే కన్నా చిన్నగా పెంచుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
చికిత్స
పరోనిచియా సోకిన గోరు క్యూటికల్స్‌ను డాక్టర్లు శుభ్రపరుస్తారు. ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, శిలీంద్రాలను తొలగించేందుకు ప్రయత్నిస్తారు. వీటికి కొన్ని రకాల క్రీములు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగిన క్రీములను ఇచ్చి బ్యాక్టీరియాను చంపేందుకు ప్రయత్నిస్తారు. మారక ముందే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.
సమస్య వచ్చాక చికిత్స గురించి ఆలోచించే బదులు, అసలు ఆ సమస్య బారిన పడకుండా ఉండడమే మంచిది. కాబట్టి గోళ్లను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఈ అనారోగ్యం రాకుండా అడ్డుకోవచ్చు.
Also read: డ్రై ఫ్రూట్స్‌ను ఇంట్లోనే సులువుగా ఇలా తయారు చేసేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.