YSRCP Problem Solve :  తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించి దాదాపుగా రెండు వారాలు అవుతోంది. దాదాపుగా ప్రతీ రోజూ పోలీసులతో పెనుగులాట జరుగుతూనే ఉంది. ఆయనను మాట్లాడనివ్వడం లేదు. అయితే బహిరంగసభల్లో మాట్లాడుకోవాలి లేకపోతే.. మాట్లాడవద్దని పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు. ఏ రూల్ ప్రకారం అలా అంటున్నారని టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు అడ్డుకుంటున్నారని.. వాహనం ఎక్కనివ్వడం లేదని.. ఆయన గ్రామాల్లో స్టూల్ లాంటి దాని మీద నిలబడినా ఒప్పుకోవడం లేదు. దీంతో లోకేష్ పాదయాత్ర విషయంలో ప్రభుత్వం భయపడుతోందని అందుకే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. 


ఏ పాదయాత్రలోనూ కనిపించనన్ని ఆంక్షలు లోకేష్ పాదయాత్రలు !


కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఏపీ మీదుగా భారత్ జోడో యాత్ర చేశారు. ఆయన పాదయాత్రకు పోలీసుల అనుమతి తీసుకున్నారో లేదో స్పష్టత లేదు కానీ .. ఎలాంటి వివాదమూ ఏర్పడలేదు. అనుమతులు అనే చర్చ జరగలేదు. పాదయాత్ర జరిగింది. ఉదయం,  సాయంత్రం పలు వర్గాలతో భేటీ అయ్యారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఇంకా కాస్త వెనక్కి వెళ్తే ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు ఆయనకు మైక్ ఉన్న వాహనం వెంట ఉండేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడేవారు. ఎవరూ అడ్డు చెప్పలేదు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పాదయాత్రల్లోనూ ఎలాంటి  ఆంక్షలు.. ఆటంకాలు లేవు. కానీ విచిత్రంగా ఒక్క లోకేష్ పాదయాత్ర విషయంలో పోలీసులు ఎక్కువగా ఆంక్షలు పెడుతున్నారు. భద్రతకు ఇరవై మంది.. అడ్డుకోవడానికి వెయ్యి మందిని పెట్టారని టీడీపీ నేతలంటున్నారు. 


లోకేష్ ను మాట్లాడనివ్వకపోవడపై సోషల్ మీడియాలో చర్చ !


చిన్న చిన్న పల్లెల్లో కూడా లోకేష్ ను  ప్రజలను ఉద్దేశించి మాట్లాడవద్దని పోలీసులు చెప్పడం చర్చనీయాంశం అవుతుంది.  పాదయాత్ర చేస్తోంది.. ప్రజలతో మాట్లాడటానికి వారినుద్దేశించి ప్రసంగించడానికి కానీ పోలీసులు మాత్రం ..  మైకులు లాక్కోవడం.. స్టూల్స్ లాగేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణం అవుతున్నాయి. గతంలో పాదయాత్రలు చేసిన వారు ఎలా చేశారు.. అప్పుడు పోలీసులు ఎలా స్పందించారు.. ఇప్పుడు పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారన్నది విశ్లేషణ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం  తీరుపై వ్యతిరేక వ్యాఖ్యలు వినిపించడానికి కారణం అవుతోంది. 


పాదయాత్రపై విరుచుకుపడుతున్న వైఎస్ఆర్‌సీపీ  !


వెైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా లోకేష్ పాదయాత్రపై విస్తృతంగా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. జనాలు లేరని.. లోకేష్ నడవలకేపోతున్నారని.. మాటల్లో తడబడుతున్నారని  పోస్టులు పెడుతున్నారు. దీని కింద టీడీపీ నేతలు తాము చెప్పాలనుకున్నది చెబుతున్నారు. కౌంటర్లు ఇస్తున్నారు. అదే సమయంలో వైసీపీ పార్టీ నేతలు రోజుకు కనీసం నలుగురు, ఐదుగురు అయినా మీడియా ముందుకు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇంతగా ఎదురుదాడి చేస్తున్నారంటే.. పాదయాత్ర  సక్సెస్ అయినట్లని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. సాధారణం ఎక్కడైనా సాఫీగా సాగితే వచ్చే ప్రచారం కన్నా ఆటంకాలు ఏర్పడితే వచ్చే ప్రచారం ఎక్కువ. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర విషయంలో అదే జరుగుతోందన్నది రాజకీయవర్గాల అంచనా.