సీఎం జగన్ పార్టీలో నేతల మధ్య విభేదాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా రాజకీయం హాట్ గా మారిన నేపథ్యంలో అలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా నేరుగా ముఖ్యమంత్రే వాటి పరిష్కారంపై శ్రద్ధ చూపిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు తన్నులాటకు దిగటంతో క్యాడర్ గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇదే నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన నేతలు గ్రూపులుగా ఏర్పడటంపై జగన్  సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఉండగా, అదే నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేశ్ కూడా జోక్యం చేసుకుంటున్నారు. తన పాత నియోజకవర్గం కావటం, తన తండ్రి ఇతర కుటుంబ సభ్యులు సైతం అదే నియోజకవర్గంలో పార్టీ కోసం ఆవిర్భావం నుంచి కష్టపడటంతో జోగి రమేశ్ మైలవరం నియోజకవర్గం వైపు మనసు పెట్టుకున్నారు. దీంతో అక్కడ జోగి రమేశ్ వర్గం ఒకటి ఏర్పడి, స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెట్టింది. ఇది వసంతకు ఇబ్బందిగా మారింది. ఒకే పార్టీలో ఉండి కూడా స్థానిక శాసనసభ్యుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టటం, అదే సమయంలో జోగికి మంత్రి పదవి రావడంతో వసంత అవమానంగా భావించారు. 


పార్టీ పెద్దల వద్ద తెగని పంచాయితీ 


మైలవరంలో మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య విభేదాలపై ఇరువురు నేతలు బాహాటంగానే కామెంట్స్ చేసుకున్నారు. అయితే ఈ వ్యవహరంపై పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయితీ కూడా చేశారు. అయినా ఇరువురు నేతలు తమ వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఈ వ్యవహరాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ గా ఉన్న మర్రి రాజశేఖర్ వద్దకు చేర్చారు. అయినా అక్కడ పంచాయితీ తెగలేదు. చివరకు ముఖ్యమంత్రి జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు. మైలవరంలో నీకేంటి పని అంటూ మంత్రి జోగి రమేశ్ ను జగన్ ను ప్రశ్నించారని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేయాలని తెగేసి చెప్పటంతో వ్యవహరం కొలిక్కి వచ్చిందని నేతలు అంటున్నారు. 


వివాదం తెర పడిందా? 


ముఖ్యమంత్రి జోక్యంతో ఈ వివాదం సమసిపోయిందని ఎవరి పనివారు చేసుకుంటామని వసంత వెల్లడించారు. అంతే కాదు తాను ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని క్లారటీ ఇచ్చారు. గతంలో తాను పార్టీ మారుతున్నానని అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో తనకు ముడిపెట్టి, పార్టీలో ఉన్నా కోవర్ట్ గా ముద్ర వేసేందుకు ప్రయత్నం జరిగిందని, అయితే ఈ విషయంపై జగన్ కు అన్ని వివరాలను అందించి, జరిగిన వ్యవహారాలు అన్ని ఆయనకు వివరించటంతో సమస్య పరిష్కారం అయ్యిందని వసంత స్పష్టం చేశారు. ఇకనైనా ఇద్దరు నేతలు వివాదాల విడిచిపెట్టి పార్టీ కోసం పనిచేస్తారో లేదో వేచిచూడాలి.